భారత్ లో పబ్జి రీ – ఎంట్రీ కి బ్రేక్

 

 

చైనాతో ఏర్పడిన సరిహద్దు వివాదం నేపథ్యంలో నిషేధానికి గురైన మోస్ట్ పాపులర్ గేమ్ పబ్జి తిరిగి భారత్లో ‘పబ్జి మొబైల్ ఇండియా’ పేరుతో విడుదలకు సిద్దమవుతోంది. ఈ మేరకు దాని పేటింట్ కంపెనీ పబ్జి క్రాప ఇటీవలే అధికారిక ప్రకటన కూడా చేసింది. అప్పటి నుంచి ఈ గేమ్ ఎప్పుడు విడుదల అవుతుందా అని పబ్జీ ప్రియులు వెయ్యి కళ్ళతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం మేరకు పబ్జి సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు మరింత సమయం పట్టనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి పబ్ జీ సంస్థకు ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. కాగా గ్లోబల్ వర్షన్ కు భిన్నంగా పబ్ జీ ఇండియన్ వర్షన్ రిలీజ్ కానుండటంపై భారతీయుల్లో క్రేజ్ నెలకొంది. భారత దేశంలో పబ్ జీ త్వరలో తన కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు అన్ని కసరత్తులు పూర్తి చేసి, ఈనెల మొదటి వారంలోనే ఈ గేమ్ ను భారతీయులకు అందుబాటులోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అయినా కేంద్ర ప్రభుత్వ శాఖ అయిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఇంకా అనుమతులు మాత్రం రాలేదు. బ్యాన్ అయిన సంస్థలు తమ వ్యాపార లావాదేవీల కోసం మనదేశంలో కేవలం ఓ కొత్త సంస్థను ఫ్లోట్ చేసేసి మళ్లీ ఆపరేషనల్ కావటం సరైన విధానం కానేకాదని కేంద్రం తేల్చిచెప్పింది. ఒకవేళ పబ్ జీ కి ఇది అంత సులువైన వ్యవహారమైతే ఇదే బాటలో టిక్ టాక్ కూడా పయనిస్తుందని, ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేస్తోంది. దీంతో పబ్ జీ గేమ్ అందుబాటులోకి వచ్చేందుకు మరింత సమయం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

 

pubg

భారత ప్రభుత్వం కొంత కాలం క్రితం పబ్ జీతో సహా కొన్ని చైనా యాప్స్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే పబ్ జీ మాత్రం సౌత్ కోరియాకు చెందిన సంస్థ కాగా దాని కార్యకలాపాలు మాత్రం చైనాలోని టాంసెంట్ అనే సంస్థ నిర్వహిస్తుంది. దీంతో భారత ప్రజల సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీని కాపాడటానికి భారత ప్రభుత్వం దీన్ని కూడా బ్యాన్ చేసింది.

అయితే పబ్జి గేమ్‌ను మళ్లీ భారత్‌లోకి తీసుకురావడానికి పబ్జీ కార్పొరేషన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌లో ఓ భాగస్వామి, కొత్త గేమ్‌తో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. అలాగే, భారత్‌లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కూడా పబ్జీ కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. లోకల్ వీడియో గేమ్స్, ఈ – స్పోర్ట్స్, ఎంటర్ టైన్‌మెంట్, ఐటీ ఇండస్ట్రీ కోసం ఈ పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉంది.