Soniya Gandhi: నేడు తెలంగాణ విమోచన దినోత్సవం. చరిత్రాత్మకమైన ఈ రోజున తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలు ప్రకటిస్తున్నట్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అమలు చేస్తామని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సభలో సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ పథకాలపై హామీ ఇచ్చారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2500లు ఇస్తామనీ, పేద మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలెండర్ అందిస్తామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని, రైతు భరోసా కింద ఏటా రైతుకు రూ.15వేలు అందిస్తామని, కౌలు రైతులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. భూమి లేని నిరుపేదలు, కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తామనీ, వరి పండించే రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూ.500ల బోనస్ ఇస్తామని, గృహ జ్యోత పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని, చేయూత పథకం కింద రూ.10 లక్షల ఆరోగ్య భీమా కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు, యువ వికాసం కింద విద్యార్ధులకు రూ.5 లక్షల వరకూ సాయం అందిస్తామని, చేయూత కింద నెలకు రూ.4వేల పింఛను అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఆవిర్భావానికి కారణం అయిన తమను ప్రజలు ఆదరించాలని సోనియా గాంధీ కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలన్నది తన కల అని అన్నారు. ప్రజలంతా తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా సోనియా గాంధీ కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే .. బీజేపీ, బీఆర్ఎస్ జూటా పార్టీలేనని విమర్శించారు. ఆ రెండు పార్టీలు తిట్టుకున్నట్లు నటిస్తూ ఒకరినొకరు సహకరించుకుంటున్నారన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ గా మారిందన్నారు. పైకి విమర్శలు చేసుకునే మోడీ, కేసిఆర్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని విమర్శించారు.
నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోడీ చక్కగా అబద్దాలు చెప్పారన్నారు. పదేళ్లుగా దేశంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రధానులు ఎన్నో భారీ సంస్థలు నెలకొల్పితే బీజేపీ సర్కార్ వాటిని అమ్ముకుంటూ వస్తొందని విమర్శించారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసిఆర్ అప్పుల పాలు చేశారని ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాము ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేస్తామని ఖర్గే హామీ ఇచ్చారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ .. కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఎలా ఇచ్చిందో.. అదే విధంగా రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి తీరుతామని అన్నారు. తెలంగాణ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. తెలంగాణలో పైకి విడిగా కనిపిస్తున్నా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం అంతా ఒక్కటేనని, తెలంగాణలో వీటిపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. పార్లమెంట్ లో బీజేపీ అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందనీ, మోడీ కనుసైగ చేయగానే బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతు ఇస్తున్నాయని విమర్శించారు. దేశంలో ప్రశ్నించిన వారిపై మోడీ సర్కార్ ఎన్నో కేసులు పెట్టిందన్నారు. కాంగ్రెస్ సభకు ఆటంకం కలిగించేందుకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు యత్నించాయని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన రోజే హామీల అమలుకు శ్రీకారం చుట్టారని చెప్పారు.