తాంత్రికం నిజమే

శ్రీశైలం, డిసెంబరు 30: శ్రీశైలంలో చోటుచేసుకున్న తాంత్రిక పూజల వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఆలయానికి చెందిన వేదపండితుడు రాధాకృష్ణ శర్మ ఈ నెల 22న తన నివాసంలో హైదరాబాద్‌కు చెందిన సురేశ్‌చంద్రతో కలసి వేద విరుద్ధమైన పూజలు చేసినట్లు అంగీకరించారు. పూజలు చేసినట్లు అంగీకరిస్తూ ఆదివారం ఆలయం ఎగ్జిక్యూటివ్ అధికారి మూర్తికి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో కలసి లేఖ అందజేశారు. తనపై వచ్చిన అభియోగాలు వాస్తవమేనంటూ, హైకోర్టులో, మానవ హక్కుల కమిషన్‌లో తాను వేసిన పిటీషన్లను వెనక్కితీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇటువంటి చర్యలకు మళ్ళీ పాల్పడితే విధులనుంచి పూర్తిగా తప్పించాలని కోరారు. తాను చేసిన తప్పులను క్షమించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఈఓకు విన్నవించారు. రాధాకృష్ణ శర్మపై సస్పెన్షన్ తొలగించి రెండు రోజుల్లోగా విధుల్లోకి తీసుకోనున్నట్లు ఈఓ తెలిపారు.