సమ్మె సైరన్ మోగిస్తున్న ఆర్‌టీసీ కార్మిక సంఘాలు

విజయవాడ, డిసెంబర్ 31: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో వివిధ ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్‌లను నెరవేర్చుకునేందుకు తాపత్రయపడుతున్నయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెలలో రాష్ట్ర రేషన్ డీలర్స్‌ సంఘాలు జెఎసిగా ఏర్పడి నిరసన కార్యక్రమాలు నిర్వహించగా సోమవారం ఎపిఎస్ ఆర్‌టీసీ కార్మికులు సమ్మెబాటకు సిద్ధమై ఎండీ సురేంద్రబాబుకు సమ్మె నోటీసు అందజేశారు. వేతన సవరణ, కారుణ్య నియామకాలు, మెరుగైన పెన్షన్ విధానం, వయో పరిమితి పెంపు, 50శాతం ఫిట్‌మెంట్ తదితర 18 డిమాండ్‌లను సమ్మె నోటీసులో పేర్కొన్నారు. తమ డిమాండ్‌లను పరిష్కరించకుంటే జనవరి 13నుండి సమ్మె చేయనున్నట్లు ఆర్‌టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) నోటీసులో హెచ్చరించింది. ప్రభుత్వం స్పందించకుంటే అన్ని కార్మిక సంఘాలతో జనవరి నాలుగవ తేదీ జెఎసీగా ఏర్పాటు అవ్వనున్నట్లు తెలిపారు.