వైసిపిలో చేరి పదవి పోగొట్టుకున్న సునీత!కరుణించేనా అధినేత?

ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామాను మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ సోమవారం ఆమోదించారు. ఈ మేరకు ఆయన శాసన మండలిలో ప్రకటించారు .సునీత శాసన మండలి సభ్యత్వానికి అక్టోబర్ 28వ తేదీన రాజీనామా చేసి లేఖను చైర్మన్‌కు పంపించారు.

టిడిపి పక్షాన ఎమ్మెల్సీగా ఎన్నికై మూడు రాజధానుల బిల్లు విషయంలో టీడీపీ విప్ ధిక్కరించి వైసిపి ప్రభుత్వానికి మద్దతిచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు ఆమెను ఎమ్మెల్సీ పదవికి అనర్హురాలిగా ప్రకటించే క్రమంలో శాసనమండలి చైర్మన్ షరీఫ్ విచారణ చేపట్టగా అనేక సార్లు వాయిదాలు కోరిన సునీత ఇక ఆ అవకాశం లేకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటం తెలిసిందే.ఆమె రాజీనామా ఇప్పుడు ఆమోదం పొందింది.2014 ఎన్నికల్లో చీరాల నుండి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి ఆమంచి కృష్ణమోహన్ చేతుల్లో ఓడిపోయిన పోతుల సునీతను తదుపరి బీసీ మహిళా కోటాలో చంద్రబాబు ఎమ్మెల్సీని చేశారు.

ఆమెకు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు పదవి కూడా ఇచ్చి గౌరవించారు. అయినప్పటికీ పోతుల సునీతకు ఎమ్మెల్యే పదవి మీద మోజు తగ్గలేదు.మొన్నటి ఎన్నికల్లో చీరాల టీడీపీ టిక్కెట్టును ఆమె తిరిగి ఆశించారు.కానీ చంద్రబాబు వ్యూహాత్మకంగా కరణం బలరాం ని చీరాలలో బరిలో నిలిపారు.అనివార్య పరిస్థితుల్లో ఆమె కరణం బలరాం వెంటే నడిచారు.కానీ బలరాం గనుక టిడిపి ఎమ్మెల్యేగా ఉంటే ఇక తనకు చీరాల లో అవకాశం రాదని భావించారు.దీంతో తగిన సమయం చూసుకొని మూడు రాజధానుల బిల్లు వంక చూపి ఆమె వైసీపీ గూటికి చేరారు.కానీ ఆ కొద్ది రోజులకే కరణం బలరాం కూడా వైసిపిలోకి వచ్చేయటం వేరే విషయం.

పోతే టీడీపీ పోతుల సునీత పార్టీ జంపింగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకొని ఆమెను అనర్హురాలిగా ప్రకటించే కార్యక్రమాన్ని చేపట్టింది. శాసనమండలి చైర్మన్గా ఉన్న షరీఫ్ కూడా టిడిపి నాయకుడే కావడంతో సునీత కి పదవీ గండం ఏర్పడింది. అప్పటికీ ఏదో ఒక విధంగా ఈ ప్రమాదాన్ని తప్పించుకోటానికి ఆమె పలు ప్రయత్నాలు చేశారు.కానీ మెడపై కత్తి వేలాడిన నేపధ్యంలో సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయక తప్పలేదు. శాసనమండలి చైర్మన్ ఆమోదంతో మాజీ ఎమ్మెల్సీగా మారిపోయిన సునీతను వైసిపి అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఎంతవరకు ఆదరిస్తారు ఏవిధంగా అందలం ఎక్కిస్తారు అన్నది వేచి చూడాలి!