కరోనా నియంత్రణ విషయమై రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డ సుప్రీం కోర్టు…!

దేశంలో అందరూ కరోనా ముప్పు ఇక లేదు…. అంతా తగ్గిపోయింది అన్నట్లు తిరుగుతుంటే సుప్రీంకోర్టు ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడింది. కరోనా వైరస్ నియంత్రణ, బాధితులకు చికిత్స వంటి అంశాలలో ఆయా రాష్ట్రాల తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు తాజాగా విచారించింది. పలు రాష్ట్రాలు కరోనా మార్గదర్శకాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలను జారీ చేసింది.

 

గుజరాత్ ఆసుపత్రి లో జరిగిన అగ్ని ప్రమాదం ని సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుంది. కరోనా బాధితులకు చికిత్స, మృతదేహాల విషయమై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇక ఢిల్లీలో కేసులు పెరగడానికి కారణం కేజ్రీవాల్ సర్కారు అవసరమైన చర్యలు తీసుకోకపోవడం అని కేంద్రం న్యాయస్థానానికి విన్నవించింది. దేశంలోని 77 శాతం కరోనా పాజిటివ్ కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదు అవుతున్నాయని…. దీనినిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అని తెలిపింది.

దేశంలో కరోనా ప్రస్తుత పరిస్థితి పై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. ఇక తాజాగా గుజరాత్ రాజ్ కోట్ ఆసుపత్రి లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై కూడా సుప్రీంకోర్టు ఆరా తీసింది. ఈ కేసుపై వాదనలను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. కరోనా పై ప్రస్తుత స్థితి నివేదికను ఢిల్లీ, మహారాష్ట్ర తో సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించాలని ఆదేశించింది న్యాయస్థానం. మార్గదర్శకాలు సరిగ్గా అమలు అయ్యేలా చూసే బాధ్యత కేంద్రానిదే అని తేల్చి చెప్పింది

“కరోనా ఆస్పత్రుల్లో ఇది తొలి ఘటన కాదు. ఇలాంటి ఘటనలకు కేంద్ర మార్గదర్శకాలు పూర్తిగా అమలుకాకపోవడమే కారణం. రాజ్​కోట్ కరోనా ఆస్పత్రి అగ్నిప్రమాదంపై గుజరాత్​ సర్కార్ నివేదిక సమర్పించాలి.దేశంలో కరోనా నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాలు అమలు అయ్యేలా చూడాలి. పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.” – సుప్రీం ధర్మాసనం.