తెలుగుదేశం పార్టీకి సుప్రీం కోర్టు నోటీసు..! ఎందుకంటే..?

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

గుంటూరు జిల్లా మంళగిరిలో టీడీపీ కార్యాలయానికి భూకేటాయింపులపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి టీడీపీ కార్యాలయానికి దఖలు పర్చిన భూకేటాయింపులను రద్దు చేయాలని పిటిషన్ కోరారు.

పిటిషన్‌పై జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రమేష్ వాదనలు వినిపించారు. దీనిపై తెలుగుదేశం పార్టీకి, ఏపి ప్రభుత్వంకి, సీఆర్డీఏలకు సుప్రీం కోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ.. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాల తరువాత చేపట్టనున్నది.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలో టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిని కేటాయించారు. ఈ భూ కేటాయింపుల్లో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తున్న స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంతకు ముందు ఏపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే  ఏపి హైకోర్టులో ఆర్కే దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీనితో ఆర్కే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.