లక్షలాది గిరిపుత్రుల మెడపై కత్తి!

ఢిల్లీ, ఫిబ్రవరి 21: అక్రమంగా అడవుల్లో ఉంటున్న వారిని జూలై 12వ తేదీలోగా ఖాళీ చేయించాలని 17 రాష్ట్రాలను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

అటవీ హక్కుల చట్టం -2006 కింద అడవిలో నివసించే హక్కును పునరుద్ధరించాలని గిరిజనులు పెట్టుకున్న ధరఖాస్తులను అటవీశాఖ తిరస్కరించినట్లయితే సదరు గిరిజనులది అక్రమ నివాసం అవుతుందని, అలాంటి వారిని అడవుల్లోంచి పంపించేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

అటవీ జంతువులను రక్షించాలంటూ జంతు సంరక్షణవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం జూలై 12నాటికి ఖాళీ చేయించాలని ఆదేశించింది.

అటవీశాఖ అధికారుల చేతిలో దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారు 17 రాష్ట్రాల్లో మొత్తం 11 లక్షల 72 వేల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

గిరిజన హక్కులు కాపాడేందుకు కేంద్రం గట్టిగా ప్రయత్నించలేదనీ, కనీసం విచారణకు ప్రభుత్వ న్యాయవాదిని పంపించలేదని గిరజన హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యుపిఎ హయాంలో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. రాష్ట్రాలు ఈ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయలేదు.

గిరిజనులకు అడవిలో నివసించే అవకాశం ఇస్తే అటవీ రక్షణ సవాల్‌గా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే పథకం ప్రకారం ధరఖాస్తులను తిరస్కరించడం, తొక్కి పెట్టడం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులకు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ విషయంపై లేఖ కూడా రాశారు. గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా, వారికి అన్నాయం జరగకుండా చూడాలని లేఖలో పేర్కొన్నారు.

అడవుల్లో నివసిస్తున్న వారి కోసం పని చేస్తున్న ఒక ఎన్‌జిఒ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ అటవీ హక్కుల పరిరక్షణ చట్టంలో సెక్షన్ 4(5)ను ఉదహరించారు. ఈ చర్యల వల్ల లక్షలాది మంది గిరిజనులకు అన్యాయం జరుగుతుందని అన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పది కోట్ల 40 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. అయితే వారి సంఖ్య 20 కోట్ల వరకూ ఉంటుందని స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయ్.