SP Music: ఎస్పీ మ్యూజిక్ SP Music సురేశ్ ప్రొడక్షన్స్ తెలుగులోనే కాదు.. యావత్ భారతదేశ చిత్ర పరిశ్రమలో పేరున్న సినీ నిర్మాణ సంస్థ. 50 ఏళ్లకు పైగా ప్రస్థానం.. 100కు పైగా సినిమాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్, స్టూడియో, ఫిల్మ్ స్కూల్, ల్యాబ్, స్టార్ హీరోలు, ఎందరికో ఉపాధి.. సురేశ్ ప్రొడక్షన్స్ గురించి చెప్పాలంటే ఇవన్నీ వస్తాయి. ఇంతటి ఘనతకు కారణం.. సంస్థకు మూల పురుషుడు డాక్టర్ డి. రామానాయుడు. ఆయనే వేసిన పునాది, నిర్మించిన సౌధాన్ని.. కుమారులు సురేశ్ బాబు, వెంకటేశ్ ఘనంగా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు మూడో తరం నుంచి రానా దగ్గుబాటి ఆ ఘనతను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈక్రమంలో సంస్థ మరో ముందడుగు వేస్తోంది. సంగీత రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ వివరాలను ట్విట్టర్లో వెల్లడించారు.
’50 ఏళ్లుగా సినిమా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తోంది సురేశ్ ప్రొడక్షన్స్. ఇప్పుడు సురేశ్ సంస్థ సంగీత రంగంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ లేబుల్ ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సంగీతం మన జీవితంలో ఓ భాగం. అది మన హృదయాంతరాలలో ఉంటుంది. దానిని మనమే సొంతంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాం. అందుకే “ఎస్పీ మ్యూజిక్” ఉత్తమమైన సంగీతాన్ని అందించే వేదికగా ఉపయోగపడాలని.. సంగీతానికి శక్తి కేంద్రంగా ఉండాలని సురేశ్ ప్రొడక్షన్స్ లక్ష్యంగా పెట్టుకుంది’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఓటీటీ హవా ఎక్కువగా ఉండటంతో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ అటువైపు అడుగు వేస్తుందనే భావించారు అంతా.
Read More: VV Vinayak: మెగా కాంపౌండ్ లో వినాయక్..! చిరంజీవి కోసం కథ..!?
ఓటీటీ సంస్థలన్నీ దాదాపు నష్టాల్లో నడుస్తున్నాయని ఆమధ్య చెప్పుకొచ్చారు సురేశ్ బాబు. అందుకు అనుగుణంగానే సరికొత్త రంగంలోకి అడుగుపెట్టి సంచలనం రేపారు. అడుగు పెట్టిన ప్రతి రంగంలో విజయమే చూసింది సురేశ్ ప్రొడక్షన్స్. ఇప్పటికే సంగీత రంగంలో అనేక సంస్థలు ఉన్నాయి. ప్రస్తుత ఆధునిక పోకడలకు, కొత్త టెక్నాలజీకి అనుగుణంగా ఎస్పీ మ్యూజిక్ కు సరికొత్త వేదికగా నిలవబోతుందని ప్రకటించారు. మరి.. రానున్న రోజుల్లో సంగీతం పరంగా కూడా ఎటువంటి సంచలనాలు నమోదు చేస్తారో చూడాలి. సినిమాల విషయానికి వస్తే నారప్ప విడుదలకు సిద్ధంగా ఉంది. విరాటపర్వం, దృశ్యం2 కూడా బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదల కాబోతున్నాయి.