సర్జికల్ స్ట్రైక్‌పై అఖిలపక్ష భేటీ

పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం ప్రకటన చేశారు. సాయంత్రం 5గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపారు.

దాడిపై ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోది నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ అయ్యింది.

ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ పాల్గొన్నారు. దాడిపై సమీక్ష నిర్వహించారు.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్‌ మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. 12 మిరాజ్‌-2000 యుద్ద విమానాలతో దాడులు చేసిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పాక్‌ ఉగ్ర సంస్థలకు చెందిన కంట్రోల్‌ రూమ్‌లను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

ఈ నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్ తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులు, పాక్ వైపు నుంచి వచ్చే ముప్పుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఎన్‌డి‌ఏ సర్కారు నిర్ణయించింది.