టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ప్రయోగాలకి, కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసి రిస్క్ తీసుకోవడంలో అందరికంటే ముందుంటాడు. కరోనా ని లెక్క చేయకుండా బిగ్ బాస్ సీజన్ 4 కోసం సెట్స్ మీదకి వచ్చాడు. అలాగే పోలీస్ అధికారిగా ‘ వైల్డ్ డాగ్ ‘ అనే సినిమాలో నటిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ గా కనించబోతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా కోసం నాగార్జున ఇప్పుడు రిస్క్ చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్ ఒకటి చేయాల్సి ఉందట. అందుకోసం థాయ్‌లాండ్ ని ఎంచుకున్నారు. అయితే ప్రభాస్, మహేష్ బాబు, నితిన్.. ఇలా వరసగా అందరూ ఫారిన్ లొకేషన్స్ లో షూటింగ్ కోసం పయనం అవుతున్న తరుణంలో నాగార్జున కూడా వైల్డ్ డాగ్ కోసం థాయ్‌లాండ్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే నాగార్జున అంత రిస్క్ చేస్తాడా .. అని కొందరు మాట్లాడుకుంటుండగా ఫ్యాన్స్ మాత్రం రిస్క్ చేసేదే మా ‘కింగ్’ అని చెప్పుకుంటున్నారట.
ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ కంప్లీటయింది కూడా. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఇటీవలే సెట్స్ మీదకి వెళ్ళిన ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ప్రస్తుతం నాగార్జున వరసగా సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే కమిటయిన బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న బ్రహ్మాస్త్ర లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
కాగా త్వరలో మరో రెండు ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేయబోతున్నట్టు తాజా సమాచారం. అందులో ఒకటి సూపర్ హిట్ సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సీక్వెల్ బంగార్రాజు. ఈ సినిమా త్వరలో మొదలబోతుందని తెలుస్తుంది. నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటించనున్నాడని సమాచారం. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించనున్నాడు.
ఇక బాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన రైడ్ సినిమాని తెలుగులో నాగార్జున తో రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం. బాలీవుడ్ లో ఈ సినిమాలో అజయ్ దేవగన్, గోవా బ్యూటీ ఇలియాన జంటగా నటించారు. తెలుగు రీమేక్ లోను నాగార్జున కి జంటగా నటించనుందని సమాచారం. ఈ సినిమా కి సంబంధించిన అధికారక ప్రకటన త్వరలో వెలువడనుందని తెలుస్తుంది.