Road Accident: తమిళనాడులోని తిరుచ్చి – చెన్నై జాతీయ రహదారిపై కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వెళుతున్న వాహనాలు ఆరు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రెండు బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు మృతి చెందారు. చెన్నై – తిరుచ్చి జాతీయ రహదారిపై నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. దీనికి తోడు కడలూరు జిల్లా వేపూర్ సమీపంలోని అయ్యనార్ పాళయం ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉండగా అక్కడ తరచు ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న ఒక కారును వేగంగా వచ్చిన ఇసుక లోడ్ లారీ ఢీకొట్టింది. దీంతో రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనర్లు, ఒక పురుషుడు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదానికి గురైన వాహనాలనే ఇతర వాహనాలు ఢీకొట్టాయి. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీల మధ్య కారు నుజ్జునుజ్జు అయి మృతి చెందిన అయిదుగురు మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులకు రెండు గంటల సమయం పట్టింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు తెలియరాలేదు. కారు లో లభించిన ఆర్ సీ బుక్ ఆధారంగా మృతి చెందిన వారు కాంచీపురం జిల్లా నంగనల్లూరు ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. వీరు మధురైలోని ఓ ప్రైవేటు హోటల్ లో బస చేసినట్లుగా రసీదు కూడా లభ్యమైంది. వీటి ఆధారంగా మృతులు ఎవరు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేస్తున్నారు.
ఏపిలో ప్రతిపక్షాలకు బిగ్ షాక్ .. రోడ్లపై సభలు, ర్యాలీలకు నిషేదాజ్ఞలు