తెలంగాణలో ఓటమిపై కాంగ్రెస్ సమీక్ష 26న

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఏకంగా మూడు రాష్ట్రాలలో అధికారాన్ని చేజిక్కించుకుని కాంగ్రెస్ జోష్‌లో ఉన్నప్పటికీ తెలంగాణ ఓటమితో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నైరాశ్యంలో మునిగిపోయారు. పార్టీ సీనియర్ నాయకులు సైతం ఓటమి పాలు కావడంతో రాష్ట్రంలో పార్టీ శ్రేణులు కూడా నిస్పృహకు గురయ్యాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు వారాలు పూర్తయినప్పటికీ పార్టీలో ఓటమిపై ఇంతదాకా సమీక్షలు జరగలేదు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఒక్క సమావేశం కూడా జరగలేదు. కనీసం సీఎల్పీ నాయకుడి విషయంలో కూడా ఏటువంటి ప్రయత్నం ప్రారంభం కాలేదు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దిశ, దశ నిర్దేశించేందుకు పార్టీ అధిష్ఠానం నడుంబిగించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి కారణాలపై సమీక్షకు, ఈ ఓటమి ప్రభావం వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలపై పడకుండా తీసుకోవలసిన చర్చలపై చర్చించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర పార్టీ నేతలను ఢిల్లీకి పిలిచింది.

ఈ నెల 26న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి రావలసిందిగా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కీలక నేతలకు ఢిల్లీకి రావలసిందిగా అధిష్ఠానం నుంచి కబురు వచ్చింది. ఈ సమీక్షా సమావేశం తరువాతనైనా తెలంగాణ కాంగ్రెస్ ఓటమి కుంగుబాటు నుంచి తేరుకుని సార్వత్రిక ఎన్నికలకు ఉత్సాహంతో సమాయత్తమౌతుందని అధినాయకత్వం ఆశిస్తోంది.