వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అరాచకపాలన సాగిస్తోందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన టిడిపి సర్వసభ్య సమావేశంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసిపి ప్రభుత్వ దౌర్జన్యాలను ఐక్యంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసిపి మైండ్ గేమ్ ఆడుతోందని చంద్రబాబు విమర్శించారు. హత్యా, రౌడీ రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. టిడిపి క్రియాశీలక కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. పనులు చేసిన కాంట్రాక్టర్‌లకు బకాయిలు విడుదల చేయకపోవడంతో వారు రోడ్డున పడ్డారని చంద్రబాబు పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్‌లకు అండగా నిలవాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, నారా లోకేష్‌తో పాటు పలువురు కీలక నేతలు హజరయ్యారు. 14 అంశాలు ప్రధాన అజెండాగా సాయంత్రం వరకూ ఈ సమావేశం కొనసాగనుంది. ఈ సందర్భంగా సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను చంద్రబాబు ప్రకటించనున్నారు.