విజయవాడ వంటి కీలక నగరంలో టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని ని సొంతపార్టీలోనే పట్టించుకునేవారు కరువయ్యారని అంటున్నారు పరిశీలకులు.
నాని వరుసగా రెండోసారి కూడా కీలకమైన విజయవాడ ఎంపీగా విజయం సాధించారు. పైగా.. తనకన్నా ధనవంతుడు.. ఎన్నికలను ప్రభావితం చేయగలడు.. అని ప్రచారం జరిగిన వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్‌ను సైతం జగన్ సునామీలో ఓడించారు.
అసలు గెలుస్తారా? గెలవరా? అనుకుంటూ.. తీవ్ర ఉత్కంఠలో ఉన్న టీడీపీని గెలుపు గుర్రం ఎక్కించారు. తొలిసారి గెలిచి నప్పుడు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. దూకుడుగా ప్రవర్తించారు. ఏకంగా ఆర్టీయే కార్యాలయంపై దాడి చేయడం.. కమిషనర్ చొక్కా పట్టుకోవడం వంటివి తెలిసిందే.ఇక, ఇప్పుడు రెండో సారి గెలిచిన తర్వాత.. ఆయన తన దూకుడును సొంతపార్టీపైనే చూపుతున్నారనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. రెండోసారి గెలుపు గుర్రం ఎక్కిన తర్వాత.. పార్టీలో ఆయనకు ప్రాధాన్యం ఊహించని విధంగా తగ్గిపోయింది.
నిజానికి కేశినేనికి ప్రాధాన్యం ఉంటుందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా చంద్రబాబు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పరిణామంతో కేశినేని అలక పాన్పు ఎక్కారు. అయితే, దీనిపై చాలా తర్జన భర్జనే సాగింది. కేశినేనిని దువ్వేందుకు ప్రయత్నాలు సాగాయి. కానీ, ఆయన ఎక్కడా తన పంతాన్ని వీడలేదు.
ఇప్పుడు రఘురామకృష్ణరాజు మాదిరిగానే గతంలో టీడీపీని ఉక్కిరిబిక్కిరికి గురి చేశారు. అయితే, ఈరేంజ్‌లో కాదులేండి. అయితే, గతంలో కేశినేని కూడాపార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నాడనే ప్రచారం ఉంది. కేశినేని మహానాడులో పాల్గొన్నా ముక్తసరిగా సరిపెట్టారు. ఈ కార్యక్రమం తర్వాత.. కేశినేని ఎవరితోనూ మాట్లాడడం మానేశారు. అంతేకాదు.. ఆయనకు స్థానిక ఎమ్మెల్యేతోనూ.. విజయవాడ నగర పార్టీ ఇంచార్జ్‌తోనూ కూడా వివాదాలు నడుస్తున్నాయి. మొత్తం మీద కేశినేని పని సొంత పార్టీలోనే విపక్షం మాదిరి తయారైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు అంటున్నారు.