బ్రేకింగ్:టీడీపీకి గుడ్ బై చెప్పిన గద్దె బాబురావు

(అమరావతి నుండి ‘న్యూస్ ఆర్బిట్’ ప్రతినిధి)

తెలుగుదేశం పార్టీకి మరో సీనియర్ నాయకుడు గుడ్ బై చెప్పారు. విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నాయకుడు గద్దె బాబురావు తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా గద్దె పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు.

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుండి గద్దె బాబురావు 1994, 1999 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే విజయం సాధించారు. అయితే వై ఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ ఆవిర్భావం అనంతరం గద్దె బాబురావు ఆ పార్టీలో చేరారు. వైసీపీలో సరైన ప్రాధాన్యత లభించక పోవడంతో 2013లో తిరిగి టీడీపీ గూటికి చేరారు బాబురావు.

టీడీపీలో రెండు సార్లు ఎమ్మెల్యే గా, పార్టీ విప్ గా పని చేసిన తనకు 2003 నుండి ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదని, పొమ్మనలేక పొగబెట్టారని వాపోయారు బాబురావు. పార్టీ పదవులు ఇవ్వకపోయినా ఫరవాలేదు కానీ పార్టీ నేతలు అవమానకరంగా వ్యవహరిస్తున్నారని బాబురావు ఆరోపించారు.