TDP MLC: మూడు రోజుల పాటు తీవ్ర ఉత్కంఠగా సాగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో చివరకు విజయం టీడీపీని వరించింది. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అధికార వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి పై టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 7,543 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సహా పలువురు వైసీపీ శ్రేణులు రీకౌంటింగ్ జరపాలంటూ ఆందోళన నిర్వహించారు. కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ రెడ్డి గెలిచినట్లుగా అధికారికంగా అధికారులు ప్రకటించినా ఆయనకు డిక్లరేషన్ మాత్రం ఇవ్వలేదు. గంటలు గడుస్తున్నా భూమిరెడ్డికి డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

ఇదే సమయంలో భారీ మెజార్టీతో గెలిచిన తమ పార్టీ అభ్యర్ధిని అభినందించేందుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరాం తదితరులు జేఎన్ టీయూ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఎంతకూ డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో రాత్రి 11.20 గంటల సమయంలో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తో కలిసి పార్టీ నేతలు జేఎన్‌టీయూ ప్రధాన ద్వారం వద్ద భైటాయించారు. గెలుపొందిన టీడీపీ అభ్యర్ధికి వెంటనే డిక్లరేషన్ ఫారం ఇవ్వాలని కాలవ, పరిటాల సునీత డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోతుండటంతో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో రిటర్నింగ్ అధికారి తిరిగి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లి వేరే మార్గం నుండి వెళ్లిపోయారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాత డిక్లరేషన్ ఫారం అందజేస్తామని అధికారులు టీడీపీ నేతలకు చెప్పినా వారు ఆందోళన కొనసాగించారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.

అర్ధరాత్రి సమయంలో అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సహా కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ వద్ద కూడా టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 1.30 వరకూ నేతలను పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ఆ తర్వాత నేతలను ఇళ్లకు పంపించివేశారు. కాగా అధికారులు డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్, ఆయన కార్యాలయం ఒత్తిడితో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత, టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. టీడీపీ అభ్యర్ధి గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించినా డిక్లరేషన్ ఇవ్వలేదని లేఖలో వివరించారు.