జ‌గన్ స‌ర్కారుకు కొత్త షాక్ రెడీ చేస్తున్న టీడీపీ?!

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఎట్టి ప‌రిస్థితుల్లో ఇర‌కాటంలో పనిచేయాల‌ని అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం ఇందుకు క‌లిసివ‌చ్చే అన్ని అంశాల‌ను వాడుకుంటోంది.

ఇటు మ‌త‌ప‌ర‌మైన అంశాలు మొద‌లుకొని అటు రాజ‌కీయ విధాన‌ల దాకా టార్గెట్ చేస్తోంది. తాజాగా ప్ర‌భుత్వ అధికారుల‌ను సైతం ఇందులోకి లాగింది. మ‌రోమారు తిరుమ‌ల అంశంలో టీడీపీ ఏపీ సీఎంను టార్గెట్ చేసింది.

మూడు త‌న్నులు… ఆరు తిట్లు అన్న‌ట్లుగా జ‌గ‌న్ పాల‌న‌

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన పైకేమో రాష్ట్ర అభివృద్ధి, నిధుల కోసం అని చెబుతూ, రాష్ట్ర పరువుని, ప్రజల ఆత్మగౌరవాన్ని తమ స్వప్రయోజనాలకోసం కేంద్ర పెద్దల ముందు తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. ఏపీలో పాలన మూడు తన్నులు, ఆరు తిట్లు అన్నట్లుగా సాగుతోందని వ్యాఖ్యానించారు. “ఎన్నికలకు ముందు ప్రత్యేకహోదా తెస్తాం. దాంతోనే రాష్ట్రంలోని 13 జిల్లాలు వాటికవే అభివృద్ది చెందుతాయి అని చెప్పినవారు, ఇప్పడెందుకు దాని గురించి మాట్లాడటం లేదు? ఈ విధంగా వారు రాష్ట్ర ప్రజలను అనేక అంశాల్లో మోసగిస్తూనే ఉన్నారు. ప్రత్యేకహోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.“ అని దీప‌క్ రెడ్డి ప్ర‌శ్నించారు.

జ‌గ‌న్ దొరికిపోయాడా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీ వెళ్లిన వారు కేంద్ర హోంమంత్రి, ఇతర మంత్రులనుకలిసి,  ఆర్థిక మంత్రిని ఎందుకు కలవలేదు? అని దీప‌క్ రెడ్డి ప్ర‌శ్నించారు. “సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లిన ఏపీ పాలకులు, కేసుల భయంతో రాష్ట్ర పరువును, ప్రజల ఆత్మ గౌరవాన్ని హస్తిన వీధుల్లో తాకట్టుపెట్టారు. 16 నెలలైనా ప్రత్యేక హోదా గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ కేంద్రంపై ఒత్తిడి చేసే ధైర్యం వైసీపీ ప్రభుత్వం చేయలేకపోయింది.“

ఆనాడే జ‌గ‌న్‌కు చెప్పాం

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే డిక్లరేషన్ లో సంతకం పెట్టాలని జగన్ ని కోరితే, అప్పుడు కూడా ఆయన ఇదే విధంగా ప్రవర్తించాడని దీప‌క్ రెడ్డి ఆరోపించారు. “ ముఖ్యమంత్రి హోదాలో  తిరుమలకు వచ్చిన జగన్, ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. హిందువుల మనోభావాలను గౌరవించి, డిక్లరేషన్ లో  ఒకచిన్న సంతకం పెడితే పోయే అంశాన్ని కూడా రాజకీయం చేయాలా? ముఖ్యమంత్రిగా జగన్ తిరుమల వచ్చినప్పుడు, ఆలయ ఈవో సింఘాల్, జేఈవో ధర్మారెడ్డి రూల్స్ ప్రకారం డిక్లరేషన్ లో సంతకం పెట్టాలని ఆయన్ని కోరాలి కదా? వారు  దగ్గరుండి మరీ ఆ పని చేయకుండా, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు?“ అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

వాళ్లంతా కోర్టుల మెట్లు ఎక్కాలి

“ఐఏఎస్ అధికారి హోదాల్లో ఉన్న వారు, ముఖ్యమంత్రిని నిబంధనల గురించి అడగలేరా? వేంకటేశ్వర స్వామి కన్నా జగన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, వారు ఆయన చుట్టూ తిరిగారు తప్ప, డిక్లరేషన్ అంశం ప్రస్తావించలేదు. ఈవో, జేఈవోలు దగ్గరుండి మరీ తప్పుచేశారు కాబట్టి, వారిని సస్పెండ్ చేయించేవరకు, హిందూ సంఘాలు కోర్టుల ద్వారా పోరాటం చేయాలని,  హిందువుల మనోభావాలను రక్షించాలని  కోరుతున్నా. “ అంటూ వారిని ఎగ‌దోసే ప్ర‌య‌త్నం చేశారు.  “రాష్ట్ర ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వ తప్పులను భరిస్తున్నంత కాలం, వారికి మరిన్ని బాధలు తప్పవు. పాలకుల తప్పులను  తప్పు అని చెప్పకపోతే, అంతిమంగా నష్టపోయేది ప్రజలే. “ అంటూ ప్ర‌జ‌ల భావోద్వేగాల‌ను ట‌చ్ చేశారు. తెలుగుదేశం పార్టీ విమ‌ర్శ‌ల‌పై అధికార వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.