భారత్ విజయాలు@150

బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో మూడో టెస్ట్ లో భారత్ విజయం సాధించడంలో సిరీస్ లో 2-1 ఆధిక్యత సాధించింది. సిరీస్ లో భాగంగా చివరి టెస్ట్ సిడ్నీలో జరుగుతుంది. కాగా ఈ విజయం తో భారత్ టెస్ట్ విజయాల సంఖ్య 150 కి చేరుకుంది. ప్రపంచయంలో  ఈ ఫీట్ సాధించిన ఐదో జట్టుగా నిలిచింది. ఇక మెల్ బోర్న్ టెస్ విషయానికి వస్తే ఈ టెస్టు లో కోహ్లీ సేన 137 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. 258/8 ఓవర్ నైట్ స్కోరుకు మరో మూడు పరగులు మాత్రమే జోడించిన ఆస్ట్రేలియా 261 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఈ ఉదయం భారీ వర్షం కారణంగా ఆట ప్రారంభం కాలేదు. వర్షం జోరు చూసి భారత విజయానికి వరుణుడు అడ్డు పడతాడా అనిపించింది. అయితే మధ్యాహ్నం వర్షం తెరిపి ఇవ్వడంతో ఆట మొదలైంది. రెండో ఓవర్లలోనే ఆస్ట్రేలియా చివరి రెండు వికెట్లను కొల్పోయింది. నిన్న భారత్ విజయానికి అడ్డుగోడలా నిలబడిన కమ్మిన్స్ బుమ్రా బౌలింగ్ లో పుజారాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో ఇక చివరి వికెట్ లాంఛనాన్ని ఇషాంత్ శర్మ పూర్తి చేశాడు. 10 పరుగులు చేసిన లయాన్ ఇషాంత్ బౌలింగ్ లో పంత్ కు క్యాచ్ ఇచ్చి ఔటవ్వడంతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్ లో 6, రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లతో ఆసీస్ ఓటమి పాలవ్వడానికి కీలక భూమిక పోషించిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.