ఏల్ఐసికి కోర్టు చివాట్లు..! జరిమానా..!ఎందుకంటే..?

 

(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

ఎల్ఐసీ వ్యవహరించిన తీరుపై తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిమానా విధించింది.

విషయంలోకి వెళితే.. ఎల్ఐసీలో సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి గతంలో రెండు నోటిఫికేషన్ లు జారీ చేసింది, రెండు నోటిఫికేషన్‌లలో కలిపి 50 పోస్టులు భర్తీ కాలేదు. ఆ పోస్టుల్లో తమను నియమించాలని కోరుతూ పరీక్షలకు హాజరైన మెరిట్ లిస్ట్ లో ఉన్న ఎల్ఐసీ తాత్కాలిక, కాంట్రాక్ట్ సిబ్బంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మెరిట్ జాబితాలో ఉన్న తాత్కాలిక సిబ్బందిని మిగిలిపోయిన ఉద్యోగాల్లోకి తీసుకుంటామనీ, వారు సంస్థకు ధరఖాస్తు చేసుకోవచ్చనీ సింగిల్ జడ్జి ధర్మాసనం ముందు ఎల్ఐసీ హామీ ఇచ్చింది. ఎనిమిది వారాల్లో వారి నియామకాలు చేపట్టాలని గత ఏడాది జులై నెలలో కోర్టు ఆదేశించింది.

ఈ ఆదేశాలను ఎల్ఐసీ అమలు చేయకపోవడంతో పిటిషనర్లు దిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దిక్కరణ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే సింగిల్ జడ్జి తీర్పుపై ఎల్ఐసీ అప్పీల్ దాఖలు చేసింది. పిటిషనర్ లు ఎల్ఐసీ గుర్తించిన జోన్‌లో లేరని ఎల్ఐసీ వాదించింది. దీనిపై  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ బి విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం  సోమవారం విచారణ చేపట్టింది. హామీ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పీలు దాఖలు చేయడం ఏమిటంటూ ఎల్ఐసీ తీరును తప్పుబట్టింది. కోర్టు సమయాన్ని వృధా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూడు అప్పీల్ కేసులకు గానూ రూ.50వేల వంతున లక్షా 50 వేల రూపాయలను జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.