తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేష్ కుమార్ కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ సీఎస్ గా సోమేష్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసింది. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఏపి క్యాడర్ కు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది.

వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర విభజన సమయంలో సీనియర్ ఐఏఎస్ సోమేష్ కుమార్ ను కేంద్రం ..ఏపికి కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసి ఆయన తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్ కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017 లో హైకోర్టును కేంద్రం ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం..తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అప్పీలుకు వెళ్లేందుకు తీర్పు అమలును మూడు వారాలు నిలిపివేయాలని సోమేష్ కుమార్ తరపు న్యాయవాది చేసిన అభ్యర్ధనను హైకోర్టు తిరస్కరించింది. కోర్టు తీర్పు కాపీ అందగానే ఏపికి వెళ్లిపోవాలని హైకోర్టు ఆదేశించింది. కాగా హైకోర్టు తీర్పును సోమేష్ కుమార్ సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.