మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని వివేకా హత్య కేసులో సోమవారం వరకూ అరెస్టు చేయవద్దంటూ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఎంపి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఇవేళ విచారణ జరిగింది. అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది సీబీఐపై కీలక ఆరోపణలు చేస్తూ వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డిని విచారించే సమయంలో విచారణ అధికారి పారదర్శకంగా వ్యవహరించడం లేదని తెలిపారు. అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారని హైకోర్టు ప్రశ్నించగా, ఆయన సీబీఐ విచారణకు వెళ్లారనీ, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

రెండు దఫాలుగా అవినాష్ రెడ్డి నుండి తీసుకున్న స్టేట్ మెంట్ ను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టుకు తెలిపారు. జనవరి 28, ఫిబ్రవరి 24న చేసిన విచారణ స్టేట్ మెంట్లపై తమకు అనుమానాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరారు. రెండు సార్లు సీబీఐ జరిపిన విచారణ ఆడియో వీడియో రికార్డింగ్ లేకుండా ఉందన్నారు. రెండు సార్లు విచారణ ముగిసిన తర్వాత అవినాష్ రెడ్డి నుండి సంతకాలు తీసుకోలేదని తెలిపారు. 40 నుండి 50 సార్లు అవినాష్ రెడ్డి స్టెట్ మెంట్ ను సీబీఐ ఎస్పీ రాంసింగ్ ఎటిట్ చేశారన్నారు. అవినాష్ రెడ్డి సంతకం లేనందున స్టేట్ మెంట్లు మార్చి ఉండొచ్చని అవినాష్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
వివేకా హత్య కేసులో అసలు నిందితుడు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డే అని అవినాష్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. అవినాష్ ను విచారణ కు పిలిచి అరెస్టు చేసే అవకాశం ఉందని అందుకే ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. మొత్తం రికార్డులు, ఫైల్స్ సోమవారం కోర్టుకు సమర్పించాలని సీబీఐకి ఆదేశించింది. విచారణ సమయంలో రికార్డు చేసిన వీడియోలను సోమవారం సమర్పించాలని తెలిపారు. సోమవారం వరకూ అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం.