మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్న సస్పెన్స్ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. సంక్రాంతికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఓ సారి సూచన ప్రాయంగా వెల్లడించినప్పటికీ…పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సంక్రాంతి తరువాత ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. తుది విడత పంచాయతీ ఎన్నికలు జనవరి 30న జరుగుతాయి. ఆ లోగానే అంటే జనవరి 21నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాం హౌస్ లో చండీయాగం నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయించారు. నాలుగు రోజుల పాటు చండీయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం లేదన్న వాదన కూడా వినిపిస్తున్నది. సంక్రాంతికి మంత్రివర్గం అని సూచనప్రాయంగా తెలిపిన కేసీఆరే ఆ తరువాత ఒక సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు తొందరెందుకు అని ప్రశ్నించారు. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది కదా? అని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో ఆయనతో పాటు హోంమంత్రి మాత్రమే ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ మూహుర్తం ఎప్పుడు అన్న దానిపై మంత్రిపదవులను ఆశిస్తున్న వారిలో సస్పెన్స్ నెలకొంది. ఈ నిరీక్షణ ఎంతకాలం అన్న దానిపై స్పష్టత లేక వారు టెన్షన్ కు గురౌతున్నారు. అయితే సీఎం మాత్రం అన్ని శాఖలనూ తానే పర్యవేక్షిస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఏది ఏమైనా కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్నదానిపై స్పష్టతకు మరి కొంత కాలం వేచి ఉండక తప్పదనే అనుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద ఇప్పటి వరకూ తెలంగాణ కేబినెట్ ఇద్దరితోనే కొలువు తీరి ఉంది. విస్తరణ ఎప్పుడన్న ఊహాగాన సభలకు, కేబినెట్ బెర్త్ లు ఎవరెవరికి దక్కుతాయన్న చర్చోపచర్చలకు ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాల్సిందే.