హైదరాబాద్: అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ తదితర ఆన్ లైన్ స్ట్రీమింగ్ యాప్స్ ల తరహాలో అచ్చ తెలుగు యాప్ ‘ఆహా’ అందుబాటులోకి వచ్చేసిందని అల్లు అరవింద్ తెలిపారు. మై హోమ్ గ్రూప్, గీతా ఆర్ట్స్ సంస్థలు తయారు చేసిన ఈ యాప్ ప్రారంభోత్సవం సందడిగా సాగింది. విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అల్లు అరవింద్ యాప్ గురించిన వివరాలను వెల్లడించారు. రోజుకు కేవలం ఒక రూపాయితో ఈ యాప్ ద్వారా వినోదాన్ని ఆస్వాదించవచ్చని ఆయన అన్నారు. ఇది పక్కా బోల్డ్ కంటెంట్ ఉండే యాప్ అనీ, ఈ మాట చెప్పడానికి తానేమీ మొహమాట పడటం లేదనీ అరవింద్ అన్నారు. ఈ యాప్ ను పేరెంటల్ గైడెన్స్ తోనే వినియోగించుకోవాలని ఆయన సూచించారు. బెంగాలీ భాషలో అందుబాటులో ఉన్న రీజనల్ ఆన్ లైన్ ఎంటర్ టెయిన్ మెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ‘హోయ్ చోయ్’ తమకు స్ఫూర్తని అరవింద్ తెలిపారు. ఈ యాప్ లో కొత్త సినిమాలు, తెలుగు వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు