ఆ ఎస్పీ చేసింది రైటా! రాంగా?? ఏపీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ !

పోలీసు శాఖను ప్రక్షాళన చేసేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అవలంభిస్తున్న వినూత్న విధానం మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

that sp did correct or not this is a hot topic in the ap now
that sp did correct or not this is a hot topic in the ap nowlatest

గత కొంతకాలంగా ఆయన పోలీసు శాఖలో సంస్కరణలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో దళిత యువకుడు మృతికి కారకుడైన ఎస్ ఐ విజయకుమార్ ని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్టు వరకు ఎస్పీ వెళ్లారు.ఇదే కేసును తారుమారు చేయబోయిన చీరాల టూటౌన్ సీఐ ఫిరోజ్ ని కూడా ఆయన రాత్రికి రాత్రే బదిలీ చేశారు.అలాగే వేటపాలెంలో ఒక హత్య కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన ఎస్సై అజయ్ కుమార్ నికూడా ఆయన సస్పెండ్ చేసేశారు.

ఒంగోలులో ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి కోసం సివిల్ పంచాయతీ నిర్వహించి ఒక దళిత వ్యక్తి మృతికి కారణమైన సీఐ లక్ష్మణ్ పై కూడా ఎస్పీ వేటు వేశారు. ఈ కేసులో రిటైర్డ్ అడిషనల్ డిఎస్పి నరహరిని అరెస్టు సైతం చేశారు. ఈ చర్యలన్నీ ప్రజల నుండి ప్రశంసలు పొందాయి .అయితే తాజాగా జిల్లాలో ముప్పై తొమ్మిది మంది పోలీసు సిబ్బందిని ఆయన బదిలీ చేశారు. వీరందరి పై అనేక అభియోగాలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయని అందువల్లే బదిలీ చేస్తున్నామని ఎస్.పి చెబుతూ వారి పేర్లతో సహా ప్రెస్ నోటు జారీ చేయడం జరిగింది.ఇదే ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఎస్పీ తప్పు చేసిన వారిపై చర్య తీసుకోవడంలో తప్పేమీ లేదని కానీ వారు అవినీతిపరులు అక్రమార్కులు అంటూ ఆయనే వారి మెడలో గంట కట్టి మరీ బదిలీలు చేయడం సరైన విధానం కాదని పోలీసులు గుసగుసలాడు కొంటున్నారు.పైగా వారందరి పేర్లతో ప్రెస్ నోట్లు ఇవ్వడం వల్ల ,అవి వార్తలుగా మీడియా లో రావడం వల్ల వీరు కొత్త స్టేషన్లో చార్జీ తీసుకునే సరికే వారి మీద ప్రజల్లో ఒకరకమైన చులకన భావం ఏర్పడిపోతుందని, వారిని ప్రజలు లెక్క లెక్క చేసే పరిస్థితి ఉండదని పోలీసులు లోలోన బాధపడిపోతున్నారు.

వీడు అదటరా..ఇదటరా..ఎస్పీ యే చెప్పాడు అంటూ వారిని సామాన్యుడు కూడా ఎగతాళి చేసే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఎస్పి ఇతర పోలీసు సిబ్బందిని హెచ్చరించే క్రమంలో ఈ చర్య తీసుకుని ఉండొచ్చు.కానీ అది పోలీసు శాఖ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేదిగా ఉందని, క్రమశిక్షణ కలిగిన శాఖ కాబట్టి ఇప్పుడు పైకెవరూ బయట పడ్డం లేదని ,దీర్ఘకాలంలో దీని పర్యవసానాలు వేరుగా ఉంటాయని పోలీసు సంఘం నాయకుడొకరు వ్యాఖ్యానించారు.ఏం జరుగుతుందో చూద్దాం మరి!