ప్రియురాలి సమాధి వద్దే ప్రాణం తీసుకున్న ప్రియుడు!

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఎంత‌లా అంటే ఒక‌రిని ఒక‌రు విడిచి ఉండ‌లేనంత‌గా ! వీరి ప్రేమ‌ను చూసి కాలానికే అసూయపుట్టేది. ఎలాగైన పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకునీ, జీవితాంతం క‌లుసుందామ‌నుకున్నారు. ఇలాంటి స‌మ‌యంలోనే కాలం క‌న్నేర్రజేయ‌డంతో అనుకోని విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం పాలైన యువ‌తి క‌న్నుమూసింది.

ముంతాజ్-షాజ‌హాన్ ప్రేమ‌ను గుర్తు చూస్తూ.. ప్రియుడు విర‌హ‌వేద‌నకు గురయ్యాడు. ప్రియురాలు లేని లోకంలో తాను ఉండలేనంటూ.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రేయ‌సి లేని జీవిత శూన్యమంటూ .. త‌న ప్రాణాలు తీసుకున్నాడు. చావును కూడా ప్రేయ‌సి ద‌గ్గ‌రే పంచుకోవాల‌నుకున్నాడేమో మ‌రి.. ప్రేయ‌సి స‌మాధి వద్ద‌నే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

ఈ విషాద ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహదేవపూర్ కు చెందిన చల్లా మహేష్, అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇటీవల సదరు యువతి అనారోగ్యంతో మరణించింది. ఈ విషయం తెలిసిన మహేష్.. తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురయ్యాడు. ఆమె లేని జీవితం వ‌ద్ద‌నుకున్నాడు. తెలంగాణ స్టేట్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (టీఎస్ ఎమ్‌డీసీ) ప‌ని చేస్తున్న మ‌హేష్.. ఎప్ప‌టిలాగే ఆదివారం నాడు విధుల‌క‌ని ఇంటి నుంచి వెళ్లాడు.

ఈ నేప‌థ్యంలోనే తాను ప్రేమించిన అమ్మాయి స‌మాధి వ‌ద్ద‌కు చేరుకున్నాడు. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి లేని లోకంలో నేను ఉండ‌లేనంటూ వాట్సాప్ స్టేట‌స్ పెట్టుకున్నాడు. అది చూసిన స్నేహితులు, కుటుంబ స‌భ్యులు అప్ర‌మ‌త్త‌మై మ‌హేష్ కోసం వెత‌క‌టం ప్రారంభించారు. అయితే, అప్ప‌టికే ప్రేయ‌సి స‌మాధికి ద‌గ్గ‌ర‌గా ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు మ‌హేష్‌.

పండుగ రోజే ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డంతో గ్రామ‌మంత‌టా విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలు బోరున విల‌పిస్తున్నాయి. ఘ‌ట‌నాస్థ‌లిని ప‌రిశీలించిన మ‌హాదేవ‌పూర్ ఎస్ఐ అనిల్ కుమార్‌..కేసు న‌మోదుచేసుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు.