కులాల కూర్పు ,నేతల నేర్పు ప్రామాణికాలుగా టిడిపి అధ్యక్ష పదవుల పందేరం!

అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు వచ్చే పార్లమెంటు స్థానాల పార్టీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమించారు.

the criteria for the TDP presidency
the criteria for the TDP presidency

జిల్లాలో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి ఏడు,బాపట్ల పార్లమెంటు పరిధిలోకి నాలుగు,నెల్లూరు పార్లమెంటు పరిధిలోకి ఒక అసెంబ్లీ స్థానం వస్తుంది. ఇంతకు ముందు వరకు జిల్లాకో పార్టీ అధ్యక్షుడు ఉండే ఫార్ములాను అనుసరించిన టిడిపి తాజాగా పార్లమెంటు నియోజకవర్గానికో అధ్యక్షుడిని నియమించే విధానాన్ని అమలు చేసింది.ఇందులో భాగంగా ఆదివారం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీలోని ఇరవై అయిదు పార్లమెంటు నియోజకవర్గాల టిడిపి అధ్యక్షులను ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లాలో కనిగిరి మాజీ శాసనసభ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి ఒంగోలు పార్లమెంటు అధ్యక్ష పదవి లభించగలదని అందరూ ఊహించారు.

ఇందుకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ నియమితులయ్యారు. ఒంగోలు లోక్సభ పరిధిలో బిసిలు ప్రత్యేకించి యాదవులు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు తెలివిగా అడుగు వేశారంటున్నారు .బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ నూకసాని బాలాజీ విద్యాధికుడు.టిడిపి ప్రభుత్వం అధికారం లో ఉండగా యాదవ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు.అందరి వాడుగా కూడా పేరు తెచ్చుకున్నారు.బాలాజీ ఎంపిక పట్ల టిడిపిలో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది!సరైన సమయంలో సరైన నేతకు చంద్రబాబు పదవి ఇచ్చారని ఆయన పార్టీని తప్పనిసరిగా బలోపేతం చేయగలరన్న నమ్మకం ఉ౦దని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.అలాగే బాపట్ల పార్లమెంటు పార్టీ అధ్యక్షునిగా అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ కి అవకాశం రాగలదని ఊహాగానాలు సాగాయి.అయితే ఇక్కడా అంచనాలు తలకిందులయ్యాయి.

తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షుడి గా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నియమితులయ్యారు.కమ్మ సామాజిక వర్గానికి చెందిన సాంబశివరావు 2014 ఎన్నికలకు ముందు పర్చూరులో టిడిపి పతనావస్థలో ఉండగా ఆ పార్టీ పగ్గాలు చేపట్టారు.వరుసగా 2014,2019ఎన్నికల్లో ఆయన పర్చూరులో గెలుపొందారు.ఇటీవల కాలంలో ఆయన వైసీపీలో చేరుతారని పెద్దగా ప్రచారం జరిగినప్పటికీ సాంబశివరావు సైకిల్ దిగలేదు.తాజాగా ఆయనకు చంద్రబాబు పెద్ద బాధ్యతను అప్పగించారు.సమర్ధుడైన నాయకునిగా ఇప్పటికే పేరు గడించిన ఏలూరి మళ్లీ బాపట్ల నియోజకవర్గంలో టిడిపికి పూర్వ వైభవం తెస్తారని పార్టీ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి.కులాల కూర్పుతో పాటు ఆయా నేతల నేర్పును కూడా పరిగణనలోకి తీసుకుని వీరికి చంద్రబాబు అవకాశం కల్పించినట్లు కనిపిస్తోంది.