ఈ కలెక్టర్ ప్రత్యేకం..! ఎందుకో తెలుసా..!?

 

ఆయన ఓ జిల్లా కలెక్టర్. స్వయంగా తానే పారపట్టి, సచివాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరిజవహర లాల్ అందరి మన్ననలు పొందుతున్నారు.

 

 

శుక్రవారం తన విధినిర్వహణలో భాగంగా విజయనగరం జిల్లాలోని ఓ మండల కేంద్రమైన మెంటాడ వెళ్లారు. అక్కడ మండల అధికారులతో మాట్లాడుతూ కార్యాలయాలను పరిశీలిస్తూ స్థానికంగా ఉన్న సచివాలయానికి చేరుకున్నారు. ఆ పరిసర ప్రాంతం అంతా అడవిని తలపిస్తూంటే ఆయన చూసి ఆశ్చర్యపోయారు.

వెంటనే సచివాలయంలో పేరుకుపోయిన చెత్తను, ఇష్టానుసారంగా పెరిగిన మొక్కలను, అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లను చూశారు. వెంటనే కత్తి, పార, బొరిగి తెప్పించారు
స్వయంగా ఆయనే రంగ ప్రవేశం చేశారు. అక్కడ ఉన్న చెత్తను తొలగించి, పిచ్చి మొక్కలను పీకి, అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించారు. ఆయనతో పాటు మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది చేతులు కలిపారు. స్థానికులు సచివాలయం చూసి అవాక్కయ్యారు. ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ను అభినందించారు. విధినిర్వహణలో జాగురూకతతో పరిసరాల పరిశుభ్రత పై ప్రాధాన్యత ఇవ్వాలని మండల అధికారులను, సచివాలయ సిబ్బందికి సూచించారు. గ్రీన్ అంబాసిడర్ అధికారులు అంతా కలిసి సచివాలయ ఆవరణను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

పరిసరాల పరిశుభ్రత వలన ఆరోగ్యం, ఆహ్లాదకరమైన జీవనం కలుగుతుందని ఆయన వివరించారు. జిల్లా కలెక్టర్ అయినప్పటికీ ఎటువంటి భేషజాలకు పోకుండా తానే అక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించారు, అదనపు కొమ్మలను స్వయంగా తొలగించి వాటిని శుభ్రం చేస్తూ సిబ్బందిలో స్ఫూర్తి నింపారు. ప్రతినిత్యం ఆయన విధినిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా మెరుపుల మెరుస్తున్న, జడివానలో, మండుటెండయినా ఉదయం లేచిన వెంటనే జిల్లా లోని ఏదో ఒక కాలనీ కి గాని చెరువు వద్దకు గాని వెళ్లి అక్కడ పరిసరాలను పరిశుభ్రం చేసి తన వెంట ఉండే పరివారం చేత కూడా చేయిస్తారు. పట్టణ సుందరీకరణకు అనునిత్యం శ్రమిస్తూ శభాష్ అనిపించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి స్థానిక ప్రజా ప్రతినిధులు వరకు అందరి మన్ననలు పొందుతున్నారు. ఇలాంటి వారి వలన జిల్లాలలోని ప్రజలతోపాటు, పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటున్నాయి. ప్రజలనే పట్టించుకోని వారు ఉంటే పరిసరాలను తీర్చిదిద్దుతున్న ఈ కలెక్టర్ మార్గ దాయకం లో అందరూ నడవాలని కోరుకుందాం.