ప్రధానమంత్రి నరేంద్రమోదీ విషయంలో దేశంలోని వివిధ రాజకీయ నాయకులు తమదైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. వివిధ సందర్భాల్లో వాటిని వ్యక్తీకరిస్తుంటారు. 
అయితే, ప్రధాని పుట్టిన రోజు సందర్బంగా కొందరు తమ అభిమానాన్ని నిర్మొహమాటంగా చాటుకున్నారు. అలాంటి వారిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకరు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా స్ఫూర్తివంతమైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఆయనకు ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పవన్ తన గ్రీటింగ్స్ వెల్లడించారు.
పవన్ ఎంత పొగిడేశారో తెలుసా?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని ఈ సందర్భంగా అనేక పదాలతో నరేంద్ర మోదీ వ్యక్తిత్వాన్ని అభివర్ణించారు. “ప్రజాప్రతినిధులుగా ఎందరికో అవకాశం కల్పిస్తుంది మన పుణ్యభూమి. అయితే అందులో కొందరే ప్రజల హృదయాలలో చిరస్థాయిగా మిగిలిపోతారు. వారి నిబద్ధత, సేవా తత్పరత, నిస్వార్థం, నిశ్చలత్వం, ధృడ సంకల్పం, ధృడ నిర్ణయం, దేశభక్తి వంటి ఉదాత్త లక్షణాలు కలవారికి ప్రజలు బ్రహ్మరథం పడతారు. అటువంటి ప్రజాపాలకులలో ఈ తరంలో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అగ్రస్థానంలో ఉంటారు.“అంటూ ప్రధానమంత్రి గురించి పవన్ కళ్యాణ్ విశ్లేషించారు.
అప్పట్లోనే మోదీజీ…
బాల్య దశలోనే సామాజిక సేవకు ఆకర్షితులైన మోదీ ఆ సేవని నిర్విరామంగా కొనసాగిస్తూ ఒక ధృడమైన నాయకునిగా రూపు దిద్దుకున్నారు అంటూ పవన్ కళ్యాణ్ విశ్లేషించారు. “ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. తేనీరు అమ్మే చిరు వ్యాపారిగా జీవనం ప్రారంభించిన ఆయన జీవన ప్రయాణం ఆదర్శప్రాయం. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి ఆయన నిలువెత్తు నిదర్శనం. తీవ్ర భూకంపంతో అతలా కుతలమైన దశలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి ఆ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిన తీరు కొనయాడ తగినది. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విజయాలను నరేంద్ర మోదీ నాయకత్వంలో గుజరాత్ దక్కించుకుంది. ఆ శక్తితోనే భారత ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు.“ అంటూ పవన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత జీవితం, రాజకయ ప్రయాణం గురించి విశ్లేషించారు.
మోదీ మళ్లీ ఎందుకు గెలవాలో చెప్పిన పవన్
భారత్ శాంతికాముక దేశమే కాదు, శత్రువులు కన్నెత్తి చూడలేని శక్తివంతమైన దేశమని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంతం అని పవన్ కళ్యాణ్ విశ్లేషించారు. ఈ ఘనతే ఆయన్ను ప్రజలకు మరింత దగ్గర చేసిందని పవన్ కళ్యాణ్ వివరించారు. “రెండోసారి కూడా నరేంద్ర మోదీని అఖండ మెజారిటీతో ప్రజలు ప్రధాని పీఠంపై ఆయనను అధిష్టింప చేశారు. మన దేశానికీ మోదీ లక్షణమైన నాయకత్వం మున్ముందు మరింత అవసరం. ఈ దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడానికి సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన పూర్ణాయుష్షును ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీ 70 వ జన్మదినం సందర్భంగా నా తరపున, జనసేన పార్టీ తరపున ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.“ అంటూ పవన్ తన శుభాకాంక్షలను ముగించారు.