Aranya rodana: 1.అప్పు ఇచ్చి చూడు – పిల్లనిచ్చి చూడు:
మనం ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు తిరిగి ఇవ్వగలిగే శక్తి కలిగిన వారై ఉండాలి.అలాగే మన పిల్లను ఒకరి ఇంటికి ఇచ్చినప్పుడు, బాగా చూసుకొనే వారై ఉండాలి. అప్పు ఇచ్చిన డబ్బు, జాగ్రత్తగా తిరిగి రావాలనీ, పెళ్లి చేసి అత్తారింటికి పంపిన పిల్ల, భద్రంగా అక్కడే ఉండాలనీ, ఈ రెండూ జీవితంలో అనుభవ పూరకం గా తెలుసుకోవాలి అని ఈ సామెత అర్ధం.
2.అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి:
అబద్ధం ఆడటం అనేది చాలా తప్పు. కానీ అత్యవసర పరిస్థితులలో అబద్ధం చెప్పవలసి వస్తే, అది అతికి నట్లుగా,అంటే నమ్మే విధంగా ఉండాలని అర్ధం.
3.అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక:
పిల్లలు వారి అమ్మ గురించి వారి మేనమామకు తెలియదనుకొని కొన్ని విషయాలను వివరిస్తూ ఉంటారు. అది మేనమామకు కాస్త అతిశయంగా అనిపించవచ్చు. ఎందుకంటే వారిద్దరూ ఒకే తల్లి బిడ్డలు, ఇద్దరూ కలిసి పెరగడం వలన ఒకరి గురించి ఒకరికి, బాగా తెలిసి ఉంటుంది కాబట్టి, మేనమామకు అమ్మ గురించి తెలియదా? అనే సందర్భంలో ఇది వాడుతుంటారు.
4.. అరణ్య రోదన అయ్యింది:
మనకు బాధ కలిగినప్పుడు, మన బాధను విని, ఓదార్చి, సమస్యకు పరిష్కారం చెప్పగలిగే వారి వద్ద మొర పెట్టుకున్న ఉపయోగం ఉంటుంది. మన బాధ విని ఏమి పట్టనట్టు ఉండేవారి దగ్గర చెప్పడం , అడవిలోనికి వెళ్ళి రోదించడం వంటిది.
5. అరనిమిషం తీరిక లేదు, దమ్మిడీ ఆదాయం లేదు:
మనిషి జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. దానిని నెరవేర్చుకోవడానికి ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ ఉండాలి. లేదంటే వృధాగా సమయం గడిచిపోతూ తీరిక ఉండదు .. ఆదాయం ఉండదు అన్నట్టు ఉంటుంది మన పని అని దీని అర్ధం.