రెండు వేర్వేరు ఘటనల్లో మూడు ఫైటర్ జెట్ విమానాలు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో యుద్ద విమానాల శిక్షణ జరుగుతుండగా అపశృతి చోటుచేసుకుంది. మొరినా సమీపంలో సుఖోయ్ -30, మిరాజ్ 2000 ఫైటర్ జెట్ లు శిక్షణలో ఉన్నాయి. ఈ క్రమంలో రెండు విమానాలు కుప్పకూలాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై ఇండియ్ ఎయిర్ ఫోర్స్ దర్యాప్తునకు ఆదేశించింది. గాల్లో విమానాలు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపై విచారమ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. జెట్ ఫ్లైట్ లు కూలిన ఘటనలో పైలట్ లు సురక్షితంగా బయటపడ్డారనీ, వారికి స్వల్ప గాయాలు అయినట్లు మోరీనా జిల్లా కలెక్టర్ తెలిపారు.

మరో వైపు ఈ ఘటనపై ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి .. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు నివేదించారు. పైలట్ల పరిస్థితి గురించి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరా తీశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ అనిల్ చౌహన్ కూడా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
మరో ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ లో జరిగింది. సాంకేతిక లోపం కారణంగా ఛార్టర్ ఫ్లైట్ కుప్పకూలినట్లుగా అనుమానిస్తున్నారు. విమానాలు కూలిన ఘటనా స్థలానికి అధికారులు, పోలీసులు హుటాహుటిన తరలివచ్చారు విమానం కూలిన ప్రాంతంలో సహాయ చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ చెప్పారు.