తెలంగాణకు చెందిన మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఇటీవల జాతీయ బాక్సింగ్ లో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. 2021 ఒలంపిక్స్ లో పాల్గొనలేకపోయిన నిఖత్ జరీన్ .. ఆ తర్వాత 2022 లో నాలుగు స్వర్ణాలు కైవశం చేసుకుంది. వీటిలో కామన్ వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ కూడా ఉండటం విశేషం. అంతే కాకుండా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లోనూ విజేతగా నిలిచింది. ప్రతిష్టాత్మక అర్జున్ అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నిజాం క్లబ్ లో నిఖత్ జరీన్ కు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ తరపున రూ.5లక్షల నజరానా అందించారు రేవంత్ రెడ్డి. నిఖత్ జరీన్ సాధించిన విజయాలను గౌరవిస్తూ పార్టీ తరపున బహుమతి ప్రకటించామన్నారు. తామంతా జరీన్ తో ఉన్నామని చెప్పేందుకే ఈ బహుమతి ప్రకటించామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం ఉండాలని నిజాం క్లబ్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామనీ, ఇందులో ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవని అన్నారు.

రాజకీయాల్లోనూ క్రీడా స్పూర్తి అవసరమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం పురుషులు ఆడే ఆట అని అడ్డుచెప్పకుండా జరీన్ ను తల్లిదండ్రులు బాక్సింగ్ ఛాంపియన్ అయ్యేందుకు ప్రోత్సహించారనీ, ఇందుకు నిఖత్ జరీన్ కుటుంబాన్ని అభినందించారు రేవంత్ రెడ్డి. క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాశీనత వీడి స్పోర్ట్స్ అకాడమి ఏర్పాటునకు గానూ నిఖత్ జరీన్ కు స్థలాన్ని కేటాయించడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా నిఖత్ జరీన్ కు పోలీస్ శాఖలో డీఎస్పీ ర్యాంక్ తో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయనీ, రిపబ్లిక్ డే (జనవరి 26) లోగా ఆమెకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిఖత్ జరీన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి సత్కరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహుమతి ప్రకటించడం పట్ల సంతోషాన్నివ్యక్తం చేశారు. అందరి మద్దతు ఉంటే దేశం గర్వించేలా ఆట తీరు కనబరుస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీ పీసీసీవర్కింగ్ ప్రెసిడెంట్, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్, కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ ఆలీ, మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు.