నూతన సంవత్సర (న్యూఇయర్) వేడుకలకు ప్రపంచమంతా ముస్తాబైంది. మరి కొద్ది గంటల్లో 2022 సంవత్సరం ముగియనుంది. నూతన సంవత్సరం 2023 కి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్దం అవుతున్నారు. అయితే ఈ శుభ సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఓ పక్క తెలంగాణ మరో పక్క ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్, విజయవాడలో శనివారం (డిసెంబర్ 31) అర్ధరాత్రి నుండి ఆదివారం తెల్లవారుజాము 2 గంటల వరకూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలు విధించారు.

భద్రతా చర్యల్లో భాగంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. బేగంపేట, లంగర్ హౌస్ ఫ్లైఓవర్లు మాత్రం తెరిచి ఉంటాయని తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, నక్లేస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వాహనాలను అనుమతించరు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ప్రజలు నిబంధనలు పాటించాలనీ, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.

విజయవాడలో బెంజ్ సర్కిల్, సివిఆర్, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ లపై రాకపోకలను బంద్ చేసినట్లు సీపీ క్రాంతి రాణా టాటా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో న్యూఇయర్ వేడుకలు నిషిద్దమని పేర్కొన్నారు. ఈవెంట్ లకు ఎక్సైేజ్, పోలీస్ అధికారుల అనుమతులు తప్పనిసరి అని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మద్యం తాగి రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ, ఏపిలో ఇవేళ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష తో పాటు జరిమానాలు విధించడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.