ఒంటరైన ఆ కంఠ బానిసలు..! బాలూకి “న్యూస్ ఆర్బిట్” అశ్రునివాళి..!

పాటకు పల్లవించే శక్తి ఇచ్చిందెవరు..?
మాటకు ప్రభవించే శక్తి తెచ్చిందెవరు..?
తెలుగుకి తెలుగు నేర్పిందెవరు..?
సంగీతానికి శక్తి ఉంటుందని చెప్పిందెవరు..?
గీతానికి గుండె చిందేస్తుందని నిరూపించిందెవరు..?
గాత్రానికి బానిసలు ఉంటారని చూపించిందెవరు..?

1946 లో ఆయన్ను కన్న తల్లిదండ్రులు కలగనలేదు.
1966 లో తొలి పాట పాడిన ఆయన కూడా ఊహించలేదు.
తన ఒడిలో తొలిసారి కూర్చోబెట్టుకున్న సినీమతల్లి ఏ మాత్రం అనుకోలేదు..!
ఓ గొంతు అయిదున్నర దశాబ్దాల పాటూ సినీమతల్లి ఒడిలో పాడుతూ, ఆ తల్లినే మైమరిపిస్తుందని..,
40 వేల పాటలు పాడుతుందని..,
14 భాషల్లో పాటలు పాడి.., కోట్ల గుండెలకు ఆ గొంతు చప్పుడుగా మారుతుందని.., వినేవారిని పాటల బానిసలుగా మారుస్తుందని.., అవలీలగా స్వరాలాపన, స్వర మార్పిడి చేస్తుందని.. ఏ మాత్రం, ఎవ్వరూ, ఓ ఒక్కరూ ఊహించలేదు.

కాలం గిర్రున తిరిగింది. ఆ కంఠం కలలో కూడా ఊపేసింది. బాల్యం, కుర్రతనం, మధ్యస్థం, ముసలి అనే తేడా లేదు. అన్ని వయస్కులకు ఆ స్వరంలో సర్వమూ నచ్చేసింది. ఆ గాత్రానికి లొంగని గేయం లేదు. ఆ గేయానికి లొంగని మనిషి లేడు. అలా మనిషిని సంగీత పిచ్చోళ్ళని చేసిన కొద్దిమంది సినీమతల్లి బిడ్డల్లో బాలు ఒకరు. అలా కెరటం 1966 లో ఎగసి.., 2020 వరకు కోట్ల మందిని తనలో కలిపేసుకుంది. తన వినసొంపైన పాటలతో ఊపేసింది. ఆయనే మనందరం ముద్దుగా బాలు గారూ అని పిలుచుకునే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

“అమ్మని మించి దైవమున్నదా..?” అంటూ అమ్మ గురించి చెప్పారు.., “అనుబంధపు తీరానికి నడిపించిన గురువుని..!” అంటూ నాన్న గురించి నేర్పారు.., “స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా..!” అంటూ స్నేహం గురించి తెలిపారు.., “నువ్వక్కడ, నేనిక్కడ.., పాటక్కడ, పలుకెక్కడ..”! అంటూ ప్రేమ పాఠాలు బోధించారు.., “ప్రేమ లేదని, ప్రేమించారాదని..”! అంటూ విరహాన్ని వివరించారు.., “ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు..”! అంటూ దేశ భక్తిని చాటారు.., “వక్రతుండా మహాకాయ.., కోటి సూర్య సమప్రభా..! అంటూ భక్తిని రేకెత్తించారు.., ఒకటేమిటి..? ప్రతీ సందర్భానికి, ప్రతీ రసానికి మీ పాట లేనిదే, మీ పాట విననిదే గడవదన్నది సత్యం.”మాటేరాని చిన్నదాని” అంటూ కోట్లాది చిన్నదానులకు కళ్ళల్లో మీ స్వర నృత్యం చూపారు. “మాటరాని మౌనమిది” అంటూ మౌనంగానే యువ గుండెలో బాణాలు వదిలారు..!! వంద, వేయి, లక్ష ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మీ స్వర నాట్యం గురించి..!!

కరోనా వచ్చింది. పోతుందిలే అనుకున్నాం. ఈ కరోనా మిమ్మల్ని తీసుకుపోతుంది అని ముందే తెలిస్తే కరోనాని దేశానికి రాకుండా అడ్డుకునేది ఈ భరతజాతి. మాయదారి వైరస్ మాయావిగా మారింది. తెలియని గాయాలు చేస్తుంది. కరోనా సోకినా.. మీ స్వరంలో ఆత్మవిశ్వాసం, మీ కళ్ళల్లో కాంతి చూసి.., కరోనాని వారంలోనే జయించేసి మళ్ళీ పాడతారనుకున్నాం. బాలూ..!! మీరు లేని పాట జాబిల్లి లేని పున్నమి లాంటిది..! కెరటం లేని సముద్రం లాంటిది..! సవ్వడి లేని మువ్వ లాంటిది..!! బాలూ మీరు మళ్ళీ రావాలి. మీ కంఠంతో మళ్ళీ పాడాలి. అర్ధ శతాబ్దం గడిచినా మీ స్వరం వినాలని ఆశ చావకముందే మీరు మృత్యు ఒడికి చేరడం ఎన్నటికీ పాటాభిమాని జీర్ణించుకోలేనిది…! కానీ మీ గానం.., మీ గాత్రం మా మదిలో మొగుతూనే ఉంటుంది. స్వరరాగ గంగా ప్రవాహం చేస్తూనే ఉంటుంది..!!😢

                          – మీ పాటకి బానిస శ్రీనివాస్ మానెం