హైదరాబాదు: తెలంగాణ రాజకీయాల్లో నేడు ఊహించని పరిణామం చోటుచేసుకున్నది. రాష్ట్రంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామాలు చేసి అధికారపక్షమైన టిఆర్ఎస్లో చేరిపోతుండగా, కాంగ్రెస్, టిడిపికి చెందిన మరి కొందరు నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ నుండే ఒక సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం.
రామగుండం టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ నేడు పార్టీకి రాజీనామా చేశారు. ఈయన గతంలో టిఎస్ ఆర్టిసి చైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. టిఆర్ఎస్ ఆవిర్భావం నుండి పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన సత్యనారాయణ డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కోరుగుంట చంద్ర చేతిలో పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో తన ఒటమికి బాల్క సుమన్‌తో పాటు మరి కొందరు పార్టీ నేతలే కారణమని సోమారపు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన చంద్ర టిఆర్ఎస్లో చేరడంతో సోమారపు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.
టిఆర్ఎస్లో క్రమశిక్షణ లేకుండా పోయిందనీ సోమారపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా పార్టీలో తనకు జరుగుతున్న అవమానంతో కలత చెంది రాజీనామా చేసినట్లు సోమారపు వెల్లడించారు.
అయితే సోమారపు బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతున్నది.