టీఆర్ఎస్‌ X బీజెపీ ఘర్షణ:కెపిహెచ్‌బీ కాలనీలో ఉద్రిక్తత..

 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో అక్కడక్కడా ఘర్షణలు చెలరేగుతున్నాయి. ప్రధానంగా బీజెపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ ఘర్షణలు తలెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా ఈ పరిస్థితి నగరంలోని పలు డివిజన్‌లలో నెలకొన్నది.

నేడు పోలింగ్ ప్రారంభం అయిన తరువాత కూడా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ కారణంగా కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ బీజెపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజెపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ నెలకొన్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజెపీ కార్యకర్తలు, ప్రభుత్వానికి అనుకూలంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆందోళన చేస్తున్న పలువురుని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.