వాయుసేన విమానం కూలి పైలెట్లు మృతి

బెంగళూరు, ఫిబ్రవరి 2: భారత వాయు సేనకు చెందిన మిరాజ్ 2000 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు.

బెంగళూరులోని హిందూస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయం వద్ద శిక్షణలో ఉన్న విమానం ప్రమాదానికి గురైంది. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పైలట్లు విమానం నుండి బయటకు వచ్చే సమయానికే మంటలకు వారు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు వెంటనే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు.

ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.