పెట్టీకేసుల్లో కాదు పెద్ద లాయర్లను పెట్టి పోలవరంపై పోరాడండి: మళ్ళీ జగన్ సర్కారుపై ఉండవల్లి మార్క్ పంచ్ డైలాగులు!!

రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ మరోసారి తనదైన శైలిలో జగన్ ప్రభుత్వానికి చురకలు వేశారు.ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే పోలవరం ప్రాజెక్టుకు ఇస్తామని కేంద్రం రాసిన లేఖ మీద తిరగబడాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన వైసిపి ప్రభుత్వానికి సూచించారు.

పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాసిన లేఖకు మంత్రి రతన్‌లాల్ కఠారియా ఈ మేరకు సమాధానమిచ్చారని ఆయన వెల్లడించారు.ఇది ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టుకు పెద్ద దెబ్బ అని ఉండవల్లి చెప్పారు.ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసేందుకు కూడా చట్టప్రకారం వీలుందన్నారు.పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున కేంద్రం నిధులు ఇచ్చి తీరాలన్నారు. పోలవరంపై న్యాయ పోరాటం చేస్తే తప్పనిసరిగా సానుకూల ఫలితం వస్తుందని ఆయన చెప్పారు.ఇలాంటి స్ట్రాంగ్ కేసుల్లో జగన్ ప్రభుత్వం వెనక్కు పోకూడదన్నారు.అతి చిన్న చిన్న కేసుల్లో కోట్ల రూపాయల ఫీజులు చెల్లించి జగన్ ప్రభుత్వం లాయర్లను పెడుతోందని కొందరు హెలికాప్టర్లలో కూడా వస్తున్నారని ఆయన చురకలు వేశారు.

అదే పని ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం మీద కేసు పెట్టి జగన్ ప్రభుత్వం చేస్తే అందరూ హర్షిస్తారన్నారు.పోలవరం ప్రాజెక్టుపై జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యను ప్రతిపక్షాలతో సహా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయక తప్పదన్నారు.టిడిపి కూడా ఈ విషయంలో వెనక్కు తగ్గే వీల్లేదన్నారు.పోలవరం ప్రాజెక్టు విషయంలో టిడిపి కనుక జగన్ ప్రభుత్వానికి సహకరించకపోతే ఆ పార్టీయే ప్రజల మద్దతు కోల్పోతుందన్నారు.పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినవన్నీ రాబడితేనే జగన్ కాబట్టి అలా చేయగలిగాడని పేరు తెచ్చుకోగలరు అన్నారు.

నవరత్నాలాంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు పైసలు పంపినందు వల్ల ప్రయోజనం తక్కువేనని ఆయన చెప్పారు.కేవలం సంక్షేమ పథకాల వల్లే ఏ రాజకీయ పార్టీ కూడా గట్టెక్కలేదు అన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ కి పోలవరం అనేది అగ్ని పరీక్ష అని,ఇందులో పాసైతేనే జగన్ వచ్చే ఎన్నికల్లో నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లి ఇది నేను చేశానని చెబుతూ నేరుగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడిగి మళ్లీ సీఎం కాగలరని ఉండవల్లి పేర్కొన్నారు.ప్రస్తుతం బంతి జగన్ కోర్టులోనే ఉందని ఆయన దాన్ని సరిగ్గా గోల్ చెయ్యాలని అరుణ్‌కుమార్ సలహా ఇచ్చారు.