సూపర్ స్టార్ కృష్ణకు ఎస్పీ బాలుకు మధ్య గొడవేంటి? ఎందుకు రెండేళ్లు దూరంగా ఉన్నారు?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేరు అన్న వార్త జీర్ణించుకోలేనిది. ఆయన పాటతో మనతో ఉంటారు అని మనం చెప్పుకోవడం సులువే కానీ ఇకపై ఆయన గొంతు వినలేము అన్న ఆలోచనే అందరినీ కలచి వేస్తోంది. దీంతో ప్రస్తుతం చాలా మంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాత ఇంటర్వ్యూలను నెమరు వేసుకుంటున్నారు. ఆయన జీవిత విశేషాలను మరోసారి తెలుసుకుంటున్నారు.

 

unknown story of fight between sp balu and super star krishna
unknown story of fight between sp balu and super star krishna

 

ఈ సందర్భంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది సూపర్ స్టార్ కృష్ణ, ఎస్పీ బాలు మధ్య ఒకప్పుడు నెలకొన్న దూరం గురించి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ఇంటర్వ్యూలో ఈ గొడవ గురించి స్పందించారు. “మేమిద్దరం ఒకసారి ఫోన్ లో సంభాషించుకుంటుంటే మరో వ్యక్తి వల్ల వివాదమొచ్చింది. ఇద్దరం కూడా కొంచెం గట్టిగానే మాట్లాడుకున్నాం. అప్పుడే డిసైడ్ చేసుకున్నా మళ్ళీ కృష్ణ సినిమాలకు పాడకూడదని. మా ఇద్దరినీ కలపడానికి చాలా మంది ప్రయత్నించారు.

రాజ్-కోటి అయితే ఎలాగైనా కలపాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. అయినా నేను వాటన్నిటినీ తప్పించుకుని తిరిగాను. ఒకానొక సందర్భంలో వేటూరి గారు ఏమయ్యా ఇక ఆ గొడవ వదలవా, ఎందుకు కృష్ణకు పాడవు అని అడిగారు. మీరు విశ్వనాథ్ అన్నయ్య సినిమాలకు ఎందుకు రాయరో నేను అడిగానా అని సమాధానం చెప్పాను. మా ఇద్దరి మధ్య అలా అని పెద్ద గొడవలు ఏం లేవు. బయట ఎక్కడ కలుసుకున్నా చాలా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. మహేష్ చైల్డ్ హుడ్ పాత్రలను నాకు చూపించి మురిసిపోయేవారు.

అయితే ఒకసారి వేటూరి నాకు ఫోన్ చేసి, నేను అంతా మాట్లాడాను. కృష్ణ నీతో మాట్లాడడానికి వస్తా అన్నారు అని చెప్పారు. అవసరం లేదండి. నేనే వెళ్లి కలుసుకుంటా అని చెప్పి పద్మాలయ స్టూడియోస్ కు వెళ్లాను. అక్కడ పనిచేసే వారందరూ నన్ను ఆ కాంపౌండ్ లో చూసి ఆశ్చర్యపోయారు. కృష్ణ గారి దగ్గరికి వెళ్లి, ఆరోజు ఫోన్ లో అని ఏదో చెప్పబోతుంటే అవన్నీ వదిలేయండి, మనం మళ్ళీ సరదాగా కలిసి పనిచేసుకుందాం అని అన్నారు, అంతే గొడవ సమసిపోయింది” అని చెప్పుకొచ్చారు బాలు.