అప్డేట్ అయిన డ్రగ్ మాఫియా: ఆహా ఏం తెలివితేటలు?

డ్రగ్‌ మాఫియా రోజుకో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుంది. మొన్నటి వరకు కేవలం గంజాయి, కొకైన్‌ వంటి మాదక ద్రవ్యాలు పొడి రూపంలో సరఫరా జరిగేవి.

 Updated Drug Mafia Wow what an  intelligence
Updated Drug Mafia Wow what an intelligence Updated Drug Mafia Wow what an intelligence

ఇప్పుడు ఎవరికీ అనుమానం రాకుండా నూనె రూపంలో ఉన్న డ్రగ్‌నుఈ మాఫియా మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అదే హషీష్‌ ఆయిల్‌. ఇది గంజాయి మొక్కల నుంచి తీసిన తైలం. దీన్ని సిగరేట్‌లో ఒకటి లేదా రెండు చుక్కలు వేసుకుని లేదా సిగరేట్‌పై ఈ ఆయిల్‌ పూత పూసి పీల్చుతారు. దీంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు. ఈ క్రమంలో హషీష్‌ ఆయిల్‌ను సరఫరా చేస్తున్న డ్రగ్‌ మాఫియాను హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి 155 గ్రాముల హషీష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఈఎస్‌ నంద్యాల అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…నేరేడ్‌మెట్‌కు చెందిన అకరం రంజిత్‌కుమార్‌(25), బోయిన్‌పల్లికి చెందిన కుకుట్ల నితీష్‌కుమార్‌ యాదవ్‌(20), సుచిత్రా ప్రాంతానికి చెందిన చల్లా సాయికుమార్‌రెడ్డి(22), సంజయ్‌ శర్మ(23), కుత్బుల్లాపూర్‌కు చెందిన సీపన గిరీష్‌కుమార్‌(24)లు గంజాయి, హషీష్‌కు బానిసయ్యారు. అనంతరం డబ్బుకోసం వ్యసనాన్నే వ్యాపారంగా మలుచుకుని హషీష్‌ ఆయిల్‌ను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం అరకు ప్రాంతానికి చెందిన సాయిరెడ్డి, విక్రమ్‌ల వద్ద నుంచి హషీష్‌ ఆయిల్‌ను రూ.1500కు 5గ్రాముల చొప్పున కొనుగోలు చేసి.. నగరంలోని సుచిత్ర, బాలానగర్‌, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల్లో 5 గ్రాములను రూ.2500 చొప్పున విక్రయిస్తున్నారు.

ఈ మేరకు సమాచారం అందుకున్న హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బోయిన్‌పల్లి నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే మార్గంలో రూట్‌వాచ్‌ నిర్వహించారు. అదే సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై వేర్వేరుగా వస్తున్న ఆ ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా హషీష్‌ ఆయిల్‌తో కూడిన 31 డబ్బాలు లభించాయి. ఒక్కో డబ్బాలో 5గ్రాముల చొప్పున మొత్తం 155గ్రాముల హషీష్‌ ఆయిల్‌, రెండు బైక్‌లు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.