మాట, నడవడికతోనే గౌరవం – వెంకయ్యనాయుడు

విజయవాడ, జనవరి 6: మన మాట, హుందాతనం, నడవడిక బట్టే మనకు గౌరవం లభిస్తుందని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, డీఆర్‌డీఓ చైర్మన్ జి సతీష్‌రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. జన్మభూమికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రారంభించామని ఉపరాష్ట్రపతి అన్నారు. తన పిల్లలు రాజకీయ వారసత్వం కోసం కాకుండా సేవా వారసత్వానికి ముందుకు రావడం తనకు ఆనందంగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు.

ఉప రాష్ట్రపతిగా విదేశాలకు వెళ్లినప్పుడు కూడా పంచెకట్టులోనే వెళ్లాననీ, అక్కడ ఎంతో గౌరవించారనీ ఆయన గుర్తు చేసుకున్నారు.  కష్టపడి, ఇష్టపడి పని చేస్తే ఎవరికైనా విజయం తథ్యమని ఆయన చెప్పారు. బాలల హక్కుల కోసం కైలాస్ సత్యార్థి తన జీవితాన్ని అంకితం చేశారని ఆయన కొనియాడారు.

ఉత్సవాల్లో భాగంగా గంగిరెద్దుల విన్యాసాలు, పశు ప్రదర్శనలను అతిధులు తిలకించారు. సంక్రాంతి ముగ్గుల పోటీల విజేతలకు వెంకయ్యనాయుడు బహుమతులు అందజేశారు. అనంతరం బసవతారకం మొబైల్ క్యాన్సర్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పాల్లొన్నారు.