ఆరే కాలనీలో విధ్వంసం!

ముంబై: మెట్రో కార్ షెడ్ నిర్మాణం కోసం ఆరే కాలనీలో చెట్లు నరకడం కొనసాగుతోంది. నిరసన తెలుపుతున్న కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలో సెక్షన్ 144 విధించారు. బుల్డోజర్లు ఆ అడవిలో ఇంకాఇంకా లోపలకు వెళుతున్నాయి. అక్కడ ఒక చెట్టు కారుపై పడిన వీడియో వైరల్ అవుతోంది. నరికిన ఒక చెట్టు కాండం ఫెన్సింగ్‌పై పడి బయట నిలిపిఉన్న కారుపై కూడా పడింది. దానితో అక్కడున్న జనం పరుగులు తీశారు.

Video Courtesy: NDTV

ఆరే కాలనీలో చెట్లు నరకడాన్ని సవాలు చేస్తూ దాఖలయిన నాలుగు పిటిషన్లను బాంబే హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఆ తర్వాత కొద్ది గంటల లోనే చెట్లు నరకడం మొదలయింది. ఇది చట్ట విరుద్దమనీ, కోర్టు ఉత్తర్వు పోస్టు చేసిన తర్వాత 15 రోజుల గడువు ఇవ్వాలనీ పర్యావరణ కార్యకర్తలు అంటున్నారు. నోటీసు గడువు ముగిసిందని ముంబై మెట్రో  రైల్ కార్పొరేషన్ ఎమ్‌డి అశ్వని భిడే అంటున్నారు.