పాకిస్థాన్‌తో ఆడాలా?: మౌనం వీడిన విరాట్ కోహ్లీ

kohli
విశాఖపట్నం: పుల్వామా దాడి నేపథ్యంలో ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టుతో టీమిండియా ఆడాలా? వద్దా? అనే విషయంపై భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మౌనం వీడారు. ఇప్పటి వరకు మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. తాజాగా కోహ్లీ మీడియా ముందుకు వచ్చాడు.

ఇంగ్లాండ్‌లో జరిగే ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టుతో ఆడటమా? లేదా? విషయంపై ప్రభుత్వం, బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకున్నా తాను, తన టీం దానికి కట్టుబడి ఉంటుందని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.

‘పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. దేశం, బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తామంతా కట్టుబడి ఉంటాం’ అని శనివారం విశాఖపట్నంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోహ్లీ పేర్కొన్నాడు. ఆదివారంనాడు ఇక్కడ ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.

(ANI సౌజన్యంతో..)

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా జూన్ 16న మాంచెస్టర్‌లో పాకిస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా ఆడే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై బోర్డ్‌ల అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే, పుల్వామా దాడిలో 40మందికిపైగా సీఆర్పీఎప్ జవాన్లు మృతి చెందిన ఘటనకు నిరసనగా టీమిండియా.. పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్ ఆడకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పుల్వామా దాడికి పాకిస్థాన్ కు చెందిన జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ తమదే బాధ్యత అని ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీసీఐ-సీఓఏ.. పాకిస్థాన్ జట్టును ప్రపంచ కప్ టోర్నీ నుంచి బహిష్కరించాలని ఐసీసీకి ఇప్పటికే ఓ లేఖ పంపింది. ఆటగాళ్లకు రక్షణ కల్పించాలని కోరింది.