జగన్ తిక్కకు లెక్కలేదు: జేసీ

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఎంపీ జేసీ దివాకరరెడ్డి పొగడ్తలైనా, విమర్శలైనా ఒక రేంజ్ లో ఉంటాయి. ఆయన వ్యాఖ్యలు ఏనాడూ కూడా పార్టీ పరిధులకు లోబడి ఉండవు. తోచినది మాట్లాడేస్తారు. సాధారణంగా ఆయన వ్యాఖ్యలు ఎప్పుడూ వివాదాలకు తెరలేపుతూ ఉంటాయి. అనంతపురంలో ఈ రోజు జరిగిన తెలుగుదేశం ధర్మపోరాట దీక్షలో కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు విపక్ష నేత వైఎస్ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే పనిలో పనిగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా సెటైర్లు వేశారు. విపక్ష నేత జగన్ కు ఏ మాత్రం ముందు చూపు ఉన్నా ఇప్పటికే సీఎం అయ్యేవారని చెప్పిన ఆయన ఇక ఆయను ఆ యోగం లేదన్నారు. కాళ్ల చూపే కానీ ముందు చూపు లేని జగన్ కు తిక్క ఎక్కువనీ, అయితే ఆ తిక్కకు ఎలాంటి లెక్కలూ లేవనీ జేసీ అన్నారు.

విభజనతో అన్ని విధాలుగా నష్టపోయిన ఏపీ నేడీ పరిస్థితుల్లో ఉందంటే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని చెప్పారు. రాష్ట్రాన్ని విచ్చిన్నం చేయాలన్న మోడీ కుట్రల నుంచి రాష్ట్రాన్ని చంద్రబాబే రక్షించారని పొగడ్తల్లో ముంచెత్తారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశం యావత్తూ ఏకమౌతుంటే…కొందరు రాష్ట్ర నేతలు మాత్రం ఆ పార్టీతో కుమ్మక్కై రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మిత్రపక్షంగా బీజేపీ ద్రోహం చేసిందని చెప్పిన జేసీ దివాకరరెడ్డి..భవిష్యత్ లో మోడీ వచ్చి బతిమాలినా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదన్నారు.

SHARE