నేనింతే !పోషించేది ప్రతిపక్ష పాత్రనే!!కుండ బద్దలు కొట్టిన ఉండవల్లి!!

తాను ప్రతిపక్ష పాత్రనే పోషిస్తానని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ స్పష్టం చేశారు.ముఖ్యమంత్రిని పొగడాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా జగన్ పై తనకి అభిమానం ఉండవచ్చునని కానీ ఆయన ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులను తప్పనిసరిగా తాను గుర్తు చేస్తుంటానని ఉండవల్లి చెప్పారు.ప్రభుత్వం తప్పు చేస్తే తాను తప్పనిసరిగా ప్రెస్ మీట్ పెడతానని కూడా ఆయన పేర్కొన్నారు.గతంలో చంద్రబాబు నాయుడు తప్పులను కూడా తాను ఎత్తిచూపానని చెప్పారు. ఇప్పుడైనా తన వరస అదేనని ప్రభుత్వం తప్పులు చేయకుంటే తాను నోరెత్తనని ఉండవల్లి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఏ పార్టీకి ,ప్రభుత్వానికి కూడా కూడా అపరిమితమైన అధికారాలు ఉండకూడదని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన విషయాన్ని ఉండవల్లి గుర్తుచేశారు.ఆ రోజుల్లో అంబేద్కర్ అప్పటి మహానాయకుడు నెహ్రూను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నారు.

అలాగని వారి మధ్య ఏ విభేదాలు లేవన్నారు.దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అంబేద్కర్ ఇలా మాట్లాడారని చెప్పారు.ఏ పార్టీ అయినా ప్రభుత్వమైనా అపరిమిత అధికారాలతో పాలన సాగిస్తుంటే ప్రజలు పట్టించుకోవాలన్నారు.లేని పక్షంలో అది దేశానికి రాష్ర్టానికి కూడా ప్రమాదమని ఉండవల్లి హెచ్చరించారు.తాను ఇప్పుడు చేస్తున్నది అదే పని ఆని,తనను ఎవరు విమర్శించినా పట్టించుకోనన్నారు.తనపై టిడిపి వైసిపి సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తుంటాయని,కరోనాలో కూడా నీవు బతికి బట్టకట్టావా అని కూడా ప్రశ్నిస్తుంటారని ఉండవల్లి చమత్కరించారు.తన వరకు తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు.

పార్లమెంటు తలుపులు వేసి రాష్ట్ర విభజన చేసిన విషయాన్ని కూడా తాను వదిలిపెట్టనని..తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నానని ఎప్పుడో ఒకరోజు పార్లమెంటులో ఈ విషయాన్ని అడిగిస్తానని ఆయన చెప్పారు.ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులను కొట్టి ఒక చిన్న పెట్టె ఇచ్చి పార్లమెంట్ బయటకు నెట్టేశారని ఆయన వ్యాఖ్యానించారు.ఆ పెట్టెలో ఏముందో ఇప్పటికీ ఎవరూ చూసుకోవడం లేదన్నారు కేంద్రం నుండి రావాల్సినవన్నీ ఆపేశారన్నారు.అయితే విభజన చట్టంలో ఉన్న చట్టబద్ధమైన అంశాలను కూడా ఎవ్వరూ లేవనెత్తడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.కేంద్రంపై నిలదీత వైఖరి అవలంబి౦చాలంటే ఎవరి భయాలు వారికి ఉన్నాయనిపిస్తోందని ఉండవల్లి చురక వేశారు.