పవన్ కళ్యాణ్ ఎందుకు పంధా మార్చినట్టు?

జనసేనాని పవన్ కల్యాణ్ తన పంథా మార్చినట్లు కనిపిస్తోంది. సొంత అజెండాతో ఆయన రాజకీయ పయనం ప్రారంభించినట్లు గోచరిస్తోంది.

Why did Pawan Kalyan change his mind
Why did Pawan Kalyan change his mind

రాజకీయ పొత్తు ఉన్నప్పటికీ బీజేపీతో సంబంధం లేకుండా తన సొంత కార్యక్రమాలతో బిజీగా ఉండేట్లు ప్రణాళికలు వేస్తున్నారు. తాజాగా క్రియాశీలక సభ్యత్వాల పేరుతో కొత్త కార్యక్రమం రూపొందించారు. ఒక్కొకరి దగ్గర రూ.500 తీసుకుని వీఐపీ సభ్యత్వాలు ఇస్తున్నారు.దీంతో పాటు మన నది – మన నుడి కార్యక్రమానికి బూజు దులిపి లైన్లో పెట్టారు. ఇవాళ్టినుంచి 5 రోజుల పాటు ఆన్ లైన్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. నదుల్ని కాపాడుకోవడం, భాషను పరిరక్షించుకోవడం దీని ప్రధాన ఉద్దేశం అంటున్న పవన్, కొంతమంది వక్తల ద్వారా  నదులు, భాషను ఎలా కాపాడుకోవాలో ప్రజలకు వివరిస్తారట.అయితే గతంలో ఎప్పుడో ప్రకటించిన ఈ కార్యక్రమాన్ని సడన్ గా ఆయన ఇప్పుడెందుకు భుజానికెత్తుకోవాల్సి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.దీని వెనుక ఒక ఆసక్తికరమైన రాజకీయ వ్యూహం ఉందంటున్నారు మత రాజకీయాల ద్వారా అంటుకున్న మకిలిని మొదట్లోనే తొలగించుకునేందుకు పవన్ ప్రయత్నాలు ప్రారంభించారని, అందుకే హడావుడిగా సొంత కార్యక్రమాలు చేపట్టారని చెబుతున్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఆలయాల్లో జరిగిన కొన్ని సంఘటనలను పురస్కరించుకుని ప్రతిపక్షాలు చెలరేగిపోయాయి.పవన్ కల్యాణ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తనకు, తన పార్టీకి కులం, మతం లేదని చెప్పుకునే పవన్ కల్యాణ్ కూడా ఈ ఆటలో పావుగా మారారు. తాను హిందువునని చెప్పుకున్నారు, ఒప్పుకున్నారు. మిగతావారి విషయంలో ఈ రాజకీయాల్ని సహించినా.. పవన్ కల్యాణ్ మరీ ఇంతగా దిగజారడాన్ని జనసైనికులు, ఆయన అభిమానులు ఒప్పుకోలేదు. సామాన్యుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో తేరుకున్న పవన్.. హిందూ అజెండాని సైడ్ లైన్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.

కానీ జరగాల్సిన డ్యామేజీ ఇప్పటికే జరిగిపోయిందని పవన్ కల్యాణ్ ని కూడా అందరు రాజకీయ నాయకుల మాదిరి గానే ప్రజలు చూసే ప్రమాదం ఏర్పడిందని జనసైనికులు అంటున్నారు.ఇంకా పవన్ కళ్యాణ్ లో మెచ్యూరిటీ చాలా రావాల్సి ఉందని,ఆవేశం తగ్గించుకుని ఆలోచనని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒక సీనియర్ జనసేన నాయకుడు అంగీకరించారు.ఆయనకి చెప్పేవారు పార్టీలో లేరని ,చెప్పినా వినే రకం కూడా కాదని జనసైనికులు బాధపడుతున్నారు