సీఎం జగన్ ఈ తప్పుడు నిర్ణయం తీసుకుంటారా..?

బీజేపీకి పాత మిత్రులందరూ దూరమవుతున్నారు. అందుకే కొత్త మిత్రులను వెతుక్కునే పనిలో పడింది. బీజేపీతో దశాబ్దాలపాటు స్నేహం చేసిన శివసేన, అకాళీదళ్, బిజూదళ్, టీడీపీ.. వంటి పార్టీలు ఓ దండం పెట్టి బయటకు వచ్చేశాయి. కానీ.. బీజేపీ ఇప్పుడు వైసీపీ, అన్నాడీఎంకే.. వంటి ప్రాంతీయ పార్టీలతో జత కట్టేందుకు సిద్ధమవుతోంది. మరి.. బీజేపీ వైఖరి, ఒంటెద్దు పోకడలను భరించలేక పలు పార్టీలు బయటకు వచ్చేస్తున్న సందర్భంలో జగన్ అటువంటి తప్పు చేస్తారా అనే ప్రశ్న కీలకంగా మారింది. ఇదంతా ఎందుకంటే.. నిన్న అమిత్ షాతో భేటీలో కేంద్రంలో వైసీపీ చేరడంపై చర్చ జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

will cm jagan take that crucial decision
will cm jagan take that crucial decision

ఈ స్నేహం పదిహేనేళ్లకు పైగానే కొనసాగింది..

ఏపీలో బీజేపీ ఉనికి ఎంతోకొంత ఉందంటే కారణం చంద్రబాబునాయుడు అనే చెప్పాలి. 1996 నుంచి 2004 వరకూ బీజేపీతో కలిసి ప్రయాణించి కేంద్రంలో వాజ్ పేయి ప్రభుత్వం ఏర్పడటానికి చంద్రబాబు సాయం చేశారు. 2004లో దారుణమైన ఓటమి తర్వాత బీజేపీకి దూరమైన చంద్రబాబు మళ్లీ 2014లో బీజేపీతోనే కలిసారు. జనసేన కూడా తోడవడంతో వీరి కూటమి అధికారంలోకి వచ్చింది. మళ్లీ 2019లో చంద్రబాబు బీజేపీతో విడిపోవడంతో సొంతంగా పోటీ చేసింది బీజేపీ. పొత్తు లేకుండా వెళ్తే ఏపీలో బీజేపీ స్థాయి ఏంటో 2019 ఎన్నికలు నిరూపించాయి. ఈనేపధ్యంలో బీజేపీకి ప్రస్తుతం వైసీపీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. వైసీపీని ఎన్డీఏలో చేర్చుకుని రాష్ట్రంలోని ఇద్దరు బీజేపీ ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు ఇవ్వాలనేది వ్యూహంగా తెలుస్తోంది.

బయటకు వెళ్లిపోయిన వారందరూ ఏకపక్ష వైఖరి నచ్చకే..

మోదీ-అమిత్ షా ఏకపక్ష వైఖరి, బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక స్నేహంగా ఉన్న పార్టీలు దూరమవుతున్నాయి. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా అకాళీదళ్ దూరమయ్యే పరిస్థితులు వచ్చాయి. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో శివసేన బీజేపీని వదిలేసింది. బిజూ జనతాదళ్ కూడా ఇలానే బయటకు వచ్చేసింది. ఇలా బీజేపీకి అందరూ దూరమవుతుంటే జగన్ ను పిలిచి ఎన్డీఏలో చేరాలని కోరుతున్నారు బీజేపీ పెద్దలు. మోదీ-షా ఏదనుకుంటే అదే చేస్తారు.. జగన్ కూడా అదే తరహా. మరి వీరి వ్యవహారశైలి ఒకరికొకరికి నచ్చుతుందో లేదో.. ఈ కలయిక కార్యరూపం దాల్చుతుందా లేదా అనేది మరో వారం రోజుల్లో తేలనుంది.