(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
గుంటూరు జిల్లా బాపట్లలో ఓ గర్భిణికి వింత శిశువు జన్మించింది. మూడు చేతులతో ముక్కు,చెవులు సరిగా లేని రూపంలో శిశువు జన్మించింది. దంపతులది మేనరిక వివాహం కావడంతో జన్యుపరమైన లోపాల వల్లే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. ఐదో నెలలో స్కానింగ్ చేసినప్పుడే శిశువుకు లోపాలు ఉన్న సంగతిని వైద్యులు గుర్తించలేకపోయారని అన్నారు. ఎనిమిదో నెలలో ఆ గర్భిణి తమ వద్దకు వచ్చినప్పుడు శిశువుకు లోపాలున్నట్టు గుర్తించామని.. కానీ ఎనిమిదో నెల కావడంతో గర్భస్రావానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. ఆ మహిళకు సాధారణ కాన్పే జరిగిందని తెలిపారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం విషమంగా ఉందని, బతికే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు చెప్పారు. గతంలోనూ ఈ దంపతులకు కాళ్లు, చేతులు లేకుండా ఓ శిశువు జన్మించి చనిపోయిందన్నారు.