యూట్యూబ్ చూస్తూ ప్రసవం!

తల్లీబిడ్డలు ఇద్దరి మృతి
గోర‌ఖ్‌పూర్‌లో విషాదం

గోర‌ఖ్‌పూర్‌: పెళ్లి కాకముందే ఆమె గర్భం దాల్చింది. బిడ్డ పుట్టినట్లు బయట తెలిస్తే కష్టమనుకుందో ఏమో.. యూట్యూబ్ వీడియో చూస్తూ తనకు తానే ప్రసవం చేసుకోవాలనుకుంది. ఈ ప్రయత్నంలో ఆమెతో పాటు ఆమె బిడ్డ కూడా మరణించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత ఊరు గోర‌ఖ్‌పూర్‌లోని బిలంద్ పూర్ ప్రాంతంలో జరిగింది. పెళ్లి కాకుండానే తల్లి అవుతున్నానన్న భయమే ఆమెతో అలా చేయించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కంటోన్మెంట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవిరాయ్ ఇదే విషయం చెప్పారు. ఉదయాన్నే ఆమె ఉండే గదిలోంచి బయటకు రక్తం వస్తుండటం ఇరుగుపొరుగులు చూసి ఇంటి యజమానికి తెలిపారు. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఇంటి యజమాని రవి ఉపాధ్యాయ తలుపు పగలగొట్టి చూసేసరికి 26 ఏళ్ల మహిళ, అప్పుడే పుట్టిన మగబిడ్డ మరణించి కనిపించారు. వెంటనే అతడు పోలీసులకు ఫోన్ చేయగా వాళ్లు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. ‘సొంతంగా బిడ్డను కనడం ఎలా’ అనే వీడియోను తన స్మార్ట్ ఫోన్లో చూస్తున్నట్లు తేలింది. మృతదేహానికి సమీపంలో ఒక కత్తెర, బ్లేడు, కొంత దారం కనిపించాయి.

బహ్రైచ్ ప్రాంతానికి చెందిన ఆ మహిళ.. నాలుగు రోజుల క్రితమే ఇల్లు అద్దెకు తీసుకుంది. ఆమె బంధువులకు మృతి విషయం చెప్పగా, వాళ్ల ద్వారానే ఆమెకు పెళ్లికాని విషయం తెలిసిందని ఎస్ఐ రవిరాయ్ తెలిపారు. త్వరలోనే తన తల్లి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తుందని చెప్పిందని ఇంటి యజమాని అన్నారు. ఆధార్ కార్డు ద్వారా వివరాలు తెలుసుకున్నాకే ఇల్లు అద్దెకు ఇచ్చానన్నారు.