మాఫియా తరహా నేరాల్లోనూ మహిళలు ముందుకు వచ్చేస్తున్నారుగా..!!

 

దేశంలో, రాష్ట్రంలో సగ భాగంగా ఉన్న మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని వివిధ సందర్భాల్లో రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు ఉపన్యాసలు ఇస్తుంటారు.  ప్రభుత్వాలు కూడా మహిళల అభ్యున్నతికి అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు చూస్తున్న సంఘటనలు చూస్తుంటే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అని చెప్పక తప్పదు. పురుషులతో సమానంగా అక్కడక్కడా మద్యం సేవిస్తున్నారు. ప్రియుడి కోసమో, కుటుంబ కలహాలతో భర్తలను హత్య చేస్తున్న ఉదంతాలు ఉన్నాయి. యువకులతో పోటీగా పబ్ లకు వెళుతున్నారు. ఇటీవల క్రికెట్ బెట్టింగ్ లోనూ ఒక మహిళ అరెస్టు అవ్వడం చూశాం. మరి కొన్న చోట్ల పేకాట లో కూడా తమ ప్రతిభను చూపుతున్నారు.  తాజాగా హైదరాబాద్‌లో పోలీస్ రైడింగ్ లో పేకాట ఆడుతూ నలుగురు సంపన్న వర్గాలకు చెందిన మహిళలు పట్టుబడటం విశేషం.

హైదరాబాదు జూబ్లీహిల్స్ వెంకటగిరి లోని ఒ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఆ ఇంట్లో పేకట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కావడం గమనార్హం. పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. సంపన్న వర్గాలకు చెందిన డాక్టర్‌లు, న్యాయవాదులు ఈ పేకాట శిబిరంలో పోలీసులకు చిక్కారు. వారి వద్ద నుండి సెల్ ఫోన్ లతో పాటు మూడు లక్షల 45వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.